మందసలో మంత్రి లోకేశ్ పర్యటన
తిత్లీ తుపాను కారణంగా అతలాకుతలమైన శ్రీకాకుళం జిల్లాలో సహాయ చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. మంత్రి నారా లోకేశ్ మందసలో పర్యటించి ప్రజలతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. అధికారులు ప్రజల తక్షణ సమస్యలను తెలుసుకుని వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ఈరోజు నుంచి రేషన్ దుకాణాల్లో ఉచితంగా బియ్యం, నిత్యావసర సరుకులు, కూరగాయలు పంపిణీ చేయనున్నారు. ప్రతి కుటుంబానికి 25 కిలోల బియ్యం, కిలో కందిపప్పు, లీటరు నూనె, కిలో బంగాళాదుంపలు, కిలో ఉల్లిపాయలు, అరకిలో చక్కెర పంపిణీ చేయనున్నారు. పంపిణీ కేంద్రాల్లో సరుకుల సరఫరా వేగంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని లోకేశ్ అధికారులకు సూచించారు. సాంయంత్రంలోపు అన్ని గ్రామాల్లో పంపిణీ కార్యక్రమం పూర్తి కావాలని, గ్రామాల్లో విద్యుత్ పునరుద్ధరుణ వేగంగా జరగాలని ఆదేశించారు. మరోవైపు వివిధ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా పునరుద్ధరణ పనులు వేగంగా జరుగుతున్నాయి. అన్ని గ్రామాల్లోని పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాల్లో భోజన సదుపాయం కొనసాగించాలని, గ్రామాల్లో నిత్యం తాగునీరు సరఫరా కొనసాగించాలని మంత్రి అధికారులను ఆదేశించారు.













