మంత్రి మేకపాటితో అమెరికా ప్రతినిధులు భేటీ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి అమెరికా ఆసక్తి చూపుతోందని, ఐటీ, అగ్రిటెక్, స్కిల్ డెవలప్మెంట్, రక్షణ వంటి పలు రంగాల్లో పెట్టుబడి అవకాశాలను పరిశీలిస్తోందని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి తెలిపారు. మంత్రి గౌతమ్‌రెడ్డితో కాన్సులేట్ జనరల్ ఆఫ్ ది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకు సంబంధించిన కమర్షియల్ ఎఫైర్స్ కౌన్సిలర్ మనోజ్ దేశాయ్, కమర్షియల్ స్పెషలిస్ట్ ఇమ్మాన్యుయేల్, పొలిటికల్ అండ్ ఎకనమిక్ స్పెషలిస్ట్ సిబా ప్రసాద త్రిపాఠి తదితరులు సమావేశమయ్యారు. మంత్రి మాట్లాడుతూ వ్యవసాయరంగాన్ని పారిశ్రామికరంగంతో అనుసంధానం చేసి బృహత్ కార్యక్రమానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. పారిశ్రామికరంగంలో సామాన్య ప్రజలు భాగస్వామ్యమయ్యేలా వ్వవసాయం, పాడి పరిశ్రమల వంటి అనుబంధ రంగాలను సమ్మిళితం చేయడం దేశంలోనే ఇదే ప్రథమమన్నారు. పెట్టుబడులకు విశాఖ అనువైన నగరంగా అమెరికా ప్రతినిధులు పేర్కొన్నారు. త్వరలోనే పెట్టుబడుల అవకాశాలపై విశాఖలో సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు.













