మురుగు కాల్వలో వైసీపీ ఎమ్మెల్యే నిరసన… ఎందుకో తెలుసా?
నెల్లూరు గ్రామీణ నియోజకవర్గం పరిధిలోని ఉమ్మారెడ్డి గుంటలో అధికార పార్టీ వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి నిరసనకు దిగారు. ముగురు కాల్వ ఉన్న ప్రాంతంలో వంతెన నిర్మాణం చేపట్టాలని గత కొంతకాలంగా ఆయన డిమాండ్ చేస్తున్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇదే కాల్వలోకి దిగి నిరసన తెలిపారు. ఇప్పుడు తాము అధికారంలో ఉన్నప్పటికీ వంతెన నిర్మాణం జరగలేదని కోటంరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. రైల్వే, నగర కార్పొరేషన్ అధికారుల నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపక్షమైనా, అధికారపక్షమైనా సమస్యల పరిష్కారంలో రాజీలేని పోరాటం చేస్తానన్నారు. ఎప్పటిలోపు పనులు ప్రారంభిస్తారో రాతపూర్వకంగా హామీ ఇవ్వాలని, అంతవరకు కాల్వ వద్ద నుంచి కదలబోనని స్పష్టం చేశారు. ఇచ్చిన గడువులోపు సమస్య పరిష్కారం కాకపోతే మురుగునీటిలోనే పడుకుంటానని తెలిపారు. దీంతో అధికారులు ఈ నెల 15న నిర్మాణ పనులు ప్రారంభించి వచ్చే నెల 15 లోపు పూర్తిచేస్తామని లిఖితపూర్వకంగా హామీ ఇచ్చారు. అనంతరం కోటంరెడ్డి తన నిరసనను విరమించారు.













