మాజీ మంత్రి కొడాలి నాని ఆసక్తికర వ్యాఖ్యలు.. ఆయన సేవలు వినియోగించుకోవడానికే
కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ప్రముఖ సినీనటుడు ఎన్టీఆర్ భేటీపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ మంత్రి కొడాలి నాని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గుడివాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ రాజకీయ వ్యూహంలో భాగంగానే ఎన్టీఆర్‌ను అమిత్ షా కలిసి ఉంటారని తెలిపారు. రాష్ట్రాల్లో తమ పార్టీని విస్తరించుకోవడానికి మోదీ, అమిత్‌షా ద్వయం ఎన్నో వ్యూహాలతో ముందుకెళ్తుందని, దానిలో భాగంగానే ఈ భేటీ జరిగి ఉంటుందన్నారు. పాన్ ఇండియా స్టార్‌గా ఎన్టీఆర్ స్థాయి పెరిగిందని, తెలుగు రాష్ట్రాలకే కాకుండా దేశవ్యాప్తంగా ఆయన సేవలు వినియోగించుకోవడానికి కూడా అయుండొచ్చని తెలిపారు. ఈ భేటీకి రాజకీయా కారణాలు తప్ప, సినిమాలు బాగున్నాయని ఎన్టీఆర్‌ను అభినందించేందుకే అంటే మాత్రం తాను నమ్మడం లేదన్నారు. బీజేపీకి రాజకీయంగా ఉపయోగం లేకుంటే మోదీ, అమిత్ షా ఒక్క నిమిషం కూడా ఎవర్నీ కలవరని నాని వ్యాఖ్యానించారు.













