Kadambari Jethwani Case : కాదంబరీ జెత్వానీ కేసు నీరుగారుతున్నట్టేనా..!?
ఆంధ్రప్రదేశ్ లో అత్యంత సంచలనం సృష్టించిన కేసుల్లో కాదంబరీ జెత్వానీది (Kadambari Jethwani) ఒకటి. ముంబైకి చెందిన హీరోయిన్, మోడల్ కాదంబరీ జెత్వానీని గత వైఎస్సార్ కాంగ్రెస్ (YSRCP) ప్రభుత్వం అక్రమంగా నిర్బంధించి వేధించిందనే ఆరోపణలపై కేసు నమోదైంది. వైసీపీ (YCP) ఓడిపోయిన తర్వాత కాదంబరీ జెత్వానీ ప్రస్తుత చంద్రబాబు ప్రభుత్వానికి ఫిర్యాదు చేసింది. ఇందులో పలువురు ఐపీఎస్ (IPS) అధికారుల పాత్ర కూడా ఉండడంతో ఈ అంశాన్ని సీరియస్ గా తీసుకుంది. గతంలో వైసీపీకి కొమ్ముకాసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐపీఎస్ అధికారులు ఈ కేసులో నిందితులుగా ఉండడంతో కచ్చితంగా వీళ్లకు శిక్ష పడడం ఖాయమనుకున్నారు. అయితే ఇప్పుడు పరిణామాలను గమనిస్తే అంత సీన్ లేదనిపిస్తోంది.
ఈ ఏడాది ఫిబ్రవరిలో కాదంబరీ జెత్వానీని ముంబై నుంచి తీసుకొచ్చి ఇబ్రహీంపట్నంలో నిర్బంధించారు పోలీసులు. ఆమెపై అక్రమంగా కేసులు పెట్టి వేధించారు. తాను ముంబైలో ఓ వ్యాపారవేత్తపై పెట్టిన కేసును విత్ డ్రా చేసుకుంటేనే విడుదల చేస్తామని వార్నింగ్ ఇచ్చారు. దీని వెనుక వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్ తో పాటు ఐపీఎస్ అధికారులు పీఎస్ఆర్ ఆంజనేయులు (PSR Anjaneyulu), కాంతి రాణా తాతా (Kanti Rana Tata), విశాల్ గున్నీ (Vishal Gunni) తదితరులు ఉన్నట్టు ఆమె ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు విచారణ మొదలు పెట్టిన పోలీసులు కుక్కల విద్యాసాగర్ ను అరెస్టు చేశారు. మిగిలిన వారిని సర్వీసుల నుంచి సస్పెండ్ చేశారు.
ఈ కేసులో తమకు ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ కాంతి రాణా తాతా, విశాల్ గున్నీ హైకోర్టును (AP High Court) ఆశ్రయించారు. వీటి విచారణ సందర్భంగా హైకోర్టు సంచలన కామెంట్స్ చేసింది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏ2 నిందితుడు పీఎస్ఆర్ ఆంజనేయులు ఎందుకు అరెస్టు చేయలేదని ప్రశ్నించింది. ఏ1గా ఉన్న కుక్కల విద్యాసాగర్ ను అరెస్టు చేశారు. ఇటీవలే ఆయన బెయిల్ పై విడుదలయ్యారు. మరి ఏ2గా ఉన్న పీఎస్ఆర్ ఆంజనేయులు ముందస్తు బెయిల్ కు కూడా దరఖాస్తు చేసుకోలేదని.. ఆయన్ను ఎందుకు అరెస్టు చేయలేదని ప్రశ్నించింది. ముందస్తు బెయిల్ కు అప్పీల్ చేసుకున్న కాంతిరాణా తాతా, విశాల్ గున్నీల పిటిషన్లపై తీర్పును జనవరి 7కు వాయిదా వేసింది.
అయితే ఐపీఎస్ లు దాఖలు చేసుకున్న ముందస్తు బెయిల్ లను ఆమోదించవద్దని అడ్వొకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీధర్ (AG Dammalapali Sridhar) హైకోర్టుకు విజ్ఞప్తి చేశారు. ఈ కేసులో ఎవర్ని అరెస్టు చేయాలి.. ఎవర్ని చేయకూడదు అనేది విచారణాధికారి విచక్షణపైన ఆధారపడి ఉంటుందని వివరించారు. అవసరం అనుకుంటే అరెస్టు చేసి విచారణ చేసే అవకాశం ఉంటుందన్నారు. అందుకే ఎవరికీ ముందస్తు బెయిల్ ఇవ్వొద్దని కోరారు. అయితే ఇప్పటికే ఏ1ను అరెస్టు చేసి విచారించింది. కానీ ఏ2 సహా ఇతర నిందితులను అరెస్టు చేయలేదు. దీన్నిబట్టి వీళ్లను అరెస్టు చేసే ఉద్దేశం దర్యాప్తుసంస్థకు లేనట్టు అర్థమవుతోంది. కుక్కల విద్యాసాగర్ (Kukkala Vidya Sagar) రాజకీయ నాయకుడు కాబట్టి సులువుగా అరెస్టు చేసింది. అయితే వీళ్లంతా ఐపీఎస్ అధికారులు కావడంతో వీళ్లను అరెస్టు చేస్తే పోలీస్ డిపార్ట్ మెంట్ లో రాంగ్ సిగ్నల్స్ వెళ్తాయనే భయం చంద్రబాబు ప్రభుత్వానికి ఉన్నట్టు అర్థమవుతోంది. అందుకే వీళ్లను అరెస్టు చేయకుండా ఇలాగా కాలం గడిపే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి.













