వైసీపీలోకి జయప్రకాశ్ నారాయణ..! నిజమేనా…?
లోక్ సత్తా వ్యవస్థాపకులు జయప్రకాశ్ నారాయణ రాజకీయ ప్రస్థానంపై కొంతకాలంగా తీవ్ర చర్చ జరుగుతోంది. ఆయన మళ్లీ పాలిటిక్స్ లో యాక్టివ్ కాబోతున్నారని.. ఏపీలోని ఏదో ఒక పార్టీ తరపున ఎన్నికల్లో పోటీ చేయబోతున్నారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే దీనిపై జయప్రకాశ్ నారాయణ కానీ, ఏ పార్టీ కానీ స్పందించలేదు. మీడియా మాత్రం జోరుగా కథనాలు వండి వారుస్తోంది. అయితే జేపీ వైసీపీలో చేరబోతున్నారని.. విజయవాడ లేదా గుంటూరు నుంచి పార్లమెంటుకు పోటీ చేస్తారని లేటెస్ట్ టాక్.
జయప్రకాశ్ నారాయణ ఇటీవల తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన మెట్రో కారిడార్ పై విమర్శలు చేశారు. రింగ్ రోడ్ చుట్టూ మెట్రో నిర్మిస్తే అది మరో కాళేశ్వరం అవుతుందన్నారు. దీనిపై బీఆర్ఎస్ నేతల నుంచి పెద్దఎత్తున విమర్శలు వచ్చాయి. ఆయనపై పేపర్లు కూడా ప్రత్యేక కథనాలు రాశాయి. ఆంధ్రా జేపీకి తెలంగాణలో పనేంటని ప్రశ్నించాయి. అయితే ఈ వ్యవహారంలో ఏపీ వైసీపీ నేతల నుంచి జేపికి నైతిక మద్దతు లభించింది. నేరుగా ఆ అంశంపైన జేపీకి సపోర్ట్ గా మాట్లాడకపోయినా ఆయనకు అనుకూలంగా స్టేట్ మెంట్లు ఇచ్చారు. దీంతో ఏదో జరుగుతోందని అప్పుడే అనిపించింది.
ఆ మధ్య విజయవాడలో ఆప్కాబ్ స్వర్ణోత్సవాలు జరిగాయి. అందులో జేపీతో పాటు సీఎం జగన్ కూడా పాల్గొన్నారు. కింద కూర్చున్న జేపీని చూసి జగన్.. మంత్రి జోగి రమేశ్ ను పంపించి జేపీని పైకి పిలిపించుకున్నారు. పక్కనే కూర్చోబెట్టుకుని చాలాసేపు మాట్లాడుకున్నారు. అప్పుడే జేపీ – వైసీపీ బంధంపై రూమర్లు వచ్చాయి. ఆ తర్వాత జేపీ పలు సందర్భాల్లో జగన్ ప్రభుత్వ పథకాలను కొనియాడారు. ముఖ్యంగా గ్రామ సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ వ్యవస్థలు చాలా మేలు చేస్తాయన్నారు. వైసీపీ ప్రభుత్వానికి అనుకూలంగా ఆయన స్టేట్ మెంట్లు ఇవ్వడంతో ఆయన రాజకీయ పునఃప్రవేశంపై జోరుగా ఊహాగానాలు మొదలయ్యాయి.
అయితే తాజాగా జేపీని విజయవాడ లేదా గుంటూరు నుంచి పార్లమెంటుకు పోటీ చేయించాలని వైసీపీ స్కెచ్ వేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ రెండు చోట్ల కమ్మ సామాజిక వర్గం ప్రభావం ఎక్కువ. జేపీ కూడా ఆ సామాజిక వర్గమే కాబట్టి కచ్చితంగా తమకు కాస్తోకూస్తో మేలు జరుగుతుందని వైసీపీ భావిస్తున్నట్టు సమాచారం. ఈ రెండు చోట్ల బలమైన అభ్యర్థులు వైసీపీకి లేరనే చెప్పొచ్చు. ఆ లోటును జేపీ ద్వారా భర్తీ చేయాలనుకుంటోందట. జేపీ పోటీ చేస్తే తటస్థ ఓటర్లు కూడా తమవైపు ఆకర్షితులవుతారనే నమ్మకం కూడా ఉంది. ఇలా అన్ని విధాలుగా బేరీజు వేసిన తర్వాత జేపీని బరిలోకి దింపాలనుకుంటున్నట్టు తెలుస్తోంది. ఒకవేళ లోక్ సభకు పోటి చేయలేకపోతే రాజ్యసభకైనా పంపి జేపీ సేవలను వాడుకోవాలనుకుంటోందట. మరి చూడాలి ఏం జరుగుతుందో..!













