YS Bharathi Reddy: వైసీపీలో భారతి రెడ్డి కీ రోల్‌కు రంగం సిద్ధం..!?

2024 ఎన్నికల్లో (2024 elections) ఓటమి తర్వాత వైసీపీ డీలా పడిన సంగతి తెలిసిందే. అయితే ఓటమిని జీర్ణించుకుని ఆ పార్టీ త్వరగానే బయటపడింది. వెనువెంటనే పార్టీ కేడర్ ను యాక్టివేట్ చేసింది. పలు కార్యక్రమాలు చేపడుతూ నిత్యం ప్రజల్లో ఉండేందుకు ప్రయత్నిస్తోంది. ప్రభుత్వాన్ని ముప్పతిప్పలు పెట్టేందుకు ట్రై చేస్తోంది. అయితే వైసీపీ నేతలపై కేసులు ఆ పార్టీని భయపెడుతున్నాయి. మరోవైపు పార్టీ అధినేత జగన్ కూడా లిక్కర్ స్కాం కేసులో అరెస్ట్ అవుతారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ నేపథ్యంలో జగన్ సతీమణి వైఎస్ భారతి (YS Bharathi) పార్టీలో కీరోల్ పోషించేందుకు సిద్ధమయ్యారనే ప్రచారం ఇప్పుడు జోరుగా సాగుతోంది.
జగన్ (YS Jagan) పార్టీ పెట్టినప్పటి నుంచి ఆయనే అన్నీతానే వ్యవహరిస్తున్నారు. జగన్ అరెస్ట్ అయినప్పుడు మాత్రం తల్లి విజయమ్మ, సోదరి షర్మిల పార్టీకోసం తీవ్రంగా కృషి చేశారు. జగనన్న వదిలిన బాణాన్ని అంటూ షర్మిల సుదీర్ఘ పాదయాత్ర చేసి పార్టీని నిలబెట్టారు. అయితే ఇప్పుడు వాళ్లిద్దరూ పార్టీలో లేరు. కుటుంబంలో విభేదాలు రావడంతో జగన్ కు దూరంగా ఉంటున్నారు. దీంతో పార్టీని నడిపించాల్సిన బాధ్యత జగన్ ఒక్కరిపైనే ఉంది. ఒకవేళ జగన్ అనుకోని పరిస్థితుల్లో అరెస్ట్ అయితే అప్పుడు పార్టీని ఎవరు నడిపిస్తారనే ప్రశ్న చాలాకాలంగా ఉంది. అయితే ఇప్పుడు జగన్ భార్య వైఎస్ భారతీ రెడ్డి ప్రముఖంగా వినిపిస్తోంది. ఎందుకంటే ఆమె తెరవెనుక పార్టీలో ఇప్పటికే కీరోల్ పోషిస్తున్నట్టు తెలుస్తోంది.
జగన్ ప్రస్తుతం పెద్దగా జనాల్లోకి రావట్లేదు. తాడేపల్లి, బెంగళూరులలో ఎక్కువగా గడుపుతున్నారు. అడపాదడపా పార్టీ నేతలనే తాడేపల్లి పిలిపించుకుని మాట్లాడుతున్నారు. అయితే పార్టీపరంగా లోటుపాట్లను సవరించుకుని దాన్ని సరిదిద్దుకోవాలనే ఆలోచనలో భారతి ఉన్నట్టు తెలుస్తోంది. అందుకే పార్టీ నేతలతో ఆమే నేరుగా ఫోన్ చేసి మాట్లాడుతున్నట్టు తెలుస్తోంది. అత్యంత నమ్మకస్తులైన వ్యక్తుల ఫోన్ల నుంచి ఆమె నేతలతో మాట్లాడుతున్నట్టు తెలుస్తోంది. పార్టీ పరిస్థితి ఎలా ఉంది.. పార్టీ మళ్లీ గెలవాలంటే ఏం చేయాలి.. లాంటి అనేక అంశాలను భారతి రెడ్డి ఆరా తీస్తున్నట్టు సమాచారం. అందుకు అనుగుణంగా మార్పులు, చేర్పులు చేయాలనే ఆలోచనలో భారతి రెడ్డి ఉన్నారని పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి.
అయితే గతంలో ఎన్నడూ లేని విధంగా భారతి రెడ్డి యాక్టివ్ రోల్ తీసుకోవడంపై పార్టీ నేతలు ఆశ్చర్యపోతున్నారు. కేడర్ లో ఇది కాస్త గందరగోళానికి దారి తీస్తోంది. జగన్ కు తెలిసే భారతీ రెడ్డి ఫోన్లు చేస్తున్నారా.. భారతీ రెడ్డికి అన్ని విషయాలూ చెప్పొచ్చా.. చెప్తే జగన్ ఎలా రిసీవ్ చేసుకుంటారు.. అనే ప్రశ్నలు కొందరిని వేధిస్తున్నట్టు సమాచారం. అందుకే భారతి రెడ్డితో మాట్లాడిన తర్వాత జగన్ దృష్టికి కూడా ఈ విషయాన్ని కొందరు నేతలు తీసుకెళ్తున్నట్టు తెలుస్తోంది. జగన్ అరెస్ట్ అయితే పార్టీని నడిపించే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పేందుకే భారతి రెడ్డి ఇప్పటి నుంచే ఫోన్లు చేసి నేతలతో టచ్ లోకి వెళ్తున్నట్టు కొందరు అంచనా వేస్తున్నారు.