“రాయలసీమ ” నామకరణం, చారిత్రక నేపథ్యం -శ్రీ భూమన్
ప్రస్తుతం రాయలసీమగా పిలువబడే ప్రాంతాలను 1800 ప్రాంతంలో నిజాం తూర్పు ఇండియా కంపెనీకి ఇవ్వటంతో అప్పటి నుండి ఈ ప్రాంతాన్ని సీడెడ్ ప్రాంతంగాను లేదా దత్త మండలాలుగాను వ్యవహరిస్తూ వచ్చినారు. దత్త మండలాలుగా పిలువబడుతూ వచ్చిన ఈ ప్రాంతానికి అతి ప్రాచీనమైన చరిత్ర వుంది. నిజానికి తెలుగు ప్రజల మొదటి నివాస స్థానం ఈ ప్రాంతమేనని తెలియజెప్పే రుజువులు కూడా వున్నాయి. ప్రాచీన కాలంలో ఈ ప్రాంతానికి హిరణ్యక రాష్ట్రమని, రేనాడు మహారాజువాడి అని పిలిచేవారు.
దీర్ఘకాలం ఈ ప్రాంతం విజయనగర రాజులు పాలన కింద వుండటం వల్ల ఈ ప్రాంతం రాయలసీమగా వ్యవహరింపబడుతూ వస్తుందనేవారు. నిజానికి ఈ ప్రాంతాన్ని ”రాయలసీమ”అని పిలిచిందెవరు? ఆ నామకరణం ఎప్పుడు ఎట్లా జరిగింది? ”రాయలసీమ” అనే పేరును బాగా ప్రచారంలో పెట్టిన వ్యక్తి గాడిచర్ల హరిసర్వోత్తమరావు కావటం వల్ల ఆయనే ఈ ప్రాంతానికి ”రాయలసీమ” అని నామకరణం చేసి వుంటారని అనుకుని నేను ఉదయంలో ఒక వ్యాసం రాసినాను. రాయలసీమ పేరు పెట్టింది చిలుకూరి నారాయణరావు గారని రుజువుల్తో అవధానం నాగరాజారావు గారు నా వ్యాసానికి ప్రతిగా ఉదయంలో రాసిన వ్యాసం చదివిన తర్వాత లోతులకెళ్ళి పరిశోధిస్తే చిలుకూరి నారాయణరావు గారే ఈ ప్రాంతానికి ”రాయలసీమ” అని పేరు పెట్టినట్లుగా తేలింది. 16,17 శతాబ్దాల్లో ఈ ప్రాంతం మట్ల సంస్థానాధీశుల ఆధీనంలో వుండేది. ఈ కాలంలో రాయబడిన ”అభిషిక్త రాఘవము” అనే ప్రబంధంలో ”రాయలసీమ” అనే పేరు ఉంది.
”గాయకులశ్వరాయబల భానులు మట్ల అనంతరాజు కౌ
క్షేయక ధార ద్రెవ్విరని చెప్పె దరింతయ కాక వేలుపున్
రాయలసీమలోన చతురంగ బలంబుల తోడ వైరములే
పాయక యున్న వారు సరిపాళెము వైచిన మట్ల జస్రమున్”
అని ఆ పద్యం. ఈ పద్యం మట్ల అనంతరాజును వర్ణించే సందర్భములోనిది. ఇంత ప్రముఖంగా వున్న రాయలసీమ పేరు ఎందుకనో ఆ తర్వాత మరుగున పడిపోయింది. ఎందుకు, ఎట్లా మరుగున పడిపోయిందనేది ఒక ప్రశ్న. ఆ తర్వాత రాజకీయంగా సంభవించిన ఒడిదుడుకుల కారణంగా ఈ ప్రాంతం అనేక సంక్షోబాలకు గురయింది. 1792-99లలో టిప్పు సుల్తాను, తూర్పు ఇండియా కంపెనీ, నిజాం నవాబులు కలిసి చేసిన యుద్ద ఫలితంగా తంజావూరు రాజు పదవీచ్యుతుడయినాడు. అతని కింద వున్న నెల్లూరు, చిత్తూరు, అనంతపురం జిల్లాలోని కొంతభాగం తూర్పు ఇండియా కంపెనీ వశమైనాయి.
1800లలో కడప, కర్నూలు, అనంతపురం, మదనపల్లి తాలూకాలు కూడా బ్రిటీషు వారి ఆధీనంలోకి పోయినాయి. అప్పటి నుండి ఈ ప్రాంతాన్ని దత్తమండలం అని, సీడెడ్ జిల్లాలని వ్యవహరిస్తూ వస్తున్నారు. దేశంలో జాతీయాభిమానం రగులుతున్న రోజుల్లో తెలుగువారిలో ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమిస్తున్న రోజులవి. అట్లాంటి సమయంలో రాజమహేంద్రవరం నుండి మహా మహోపాధ్యాయ, కళాప్రపూర్ణ చిలుకూరి నారాయణరావు గారు ఉద్యోగ రీత్యా అనంతపురం వచ్చినారు. ఆయన వచ్చేనాటికి రాయలసీమ వాసుల్లో దత్త అనే మాట ఏవగింపు కలిగింది. ఆ పేరు బానిసత్వానికి చిహ్నంగా భావిస్తున్నారు. చిలుకూరి వారికి కూడా ఈ దత్త అనే పేరు వెగటుగా అనిపించింది. దత్త అనే పేరుతో 128 పంక్తుల్లో మంజరీ ద్విపదలో సీమ ఘనతను గానం చేసినారు.
దత్త నందురు నన్ను దత్త నెట్లగుదు
రిత్త స మాటలు చేత చిత్తముకలగె
ఇచ్చిన దెవ్వరో పుచ్చిన దెవరొ
పుచ్చుకొన్నట్టి యా పురుషులు నెవరొ
తురక బిడ్డం డిచ్చె దొరబిడ్డ పట్టె
అత్త సొమ్మును గొని యల్లుండు
దాన మమర జేసెనటన్న యట్లున్నదిది
అని ఎద్దేవా చేసినారు. సీమ ప్రాశస్త్యాన్ని కొనియాడారు…
ఆ రోజుల్లో రాయలసీమ వారు తమ హక్కులు, అవసరాల కోసం సంఘటితమవుతున్నారు. బాపట్లలో జరిగిన మొదటి ఆంధ్ర మహాసభల్లో పాల్గొన్న గుత్తి కేశవ పిళ్లైగారు ప్రత్యేక రాష్ట్రం ఏర్పడటం వల్ల తమ ప్రాంతానికి వచ్చే లాభమేమిటని ప్రశ్నించినారు. ఈ ప్రాంతపు నలుమూలలా రాయలసీమ అవసరాల గూర్చిన ఆలోచన మొదలయింది. 1928 నవంబరు 17,18 తేదీలలో నంద్యాలలో ఆంధ్ర మహాసభలు జరిగినాయి. అప్పటికే రాయలసీమ వారి మనోభావాలను పసిగట్టిన కోస్తా ఆంధ్రులు మెళకువగా వ్యవహరిస్తున్నారు. 18వ తేదీన కడప కోటిరెడ్డి గారి అధ్యక్షతన ప్రథమ దత్త మండల సమావేశం జరిగింది. ఈ సభలో చిలుకూరి నారాయణరావు గారు పాల్గొన్నారు. ఈ ప్రాంతానికి ఏం పేరు పెడితే బావుంటుందన్న చర్చ ఈ సభలోనే జరిగింది. చిలుకూరి వారు గబుక్కున ”రాయలసీమ” అన్నారు. సభలో పప్పూరి రామాచార్యుల వారిచేత ఒక తీర్మానం ప్రతిపాదింపజేసినారు. ఆ తీర్మానాన్ని సభ చేత ఆమోదింపజేసినది చిలుకూరివారే. ఆ పేరు రగులుకుంది. దావానలంలా వ్యాపించింది.
****************
” రాయలసీమ ముఖచిత్రం ” నుండి.













