ఏపీలో రూ. 750 కోట్ల పెట్టుబడితో హెచ్ సీఎల్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ రంగ చరిత్రలో హెచ్సీఎల్ రాక ప్రత్యేకమైనదని, చిరస్మరణీయమవుతుందని రాష్ట్ర పంచాయతీరాజ్, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ అన్నారు. కృష్ణా జిల్లా గన్నవరం మండలం కేసరపల్లి వద్ద ఏర్పాటుచేస్తున్న హెచ్సీఎల్ సంస్థ భవన నిర్మాణాల భూమి పూజలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ రాష్ట్రానికి ఇప్పటి వచ్చిన ఐటీ సంస్థల్లో హెచ్సీఎల్ అతి పెద్దదని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, హెచ్సీఎల్ అధినేత శివ్నాడార్ల మధ్య చర్చల ఫలితంగానే రాష్ట్రానికి హెచ్సీఎల్ వచ్చిందని అన్నారు. రాజధానిలో ఏర్పాటవుతున్న హెచ్సీఎల్ ప్రాంగణం దేశంలోనే అతిపెద్ద శాఖగా మారనుందని తెలిపారు. రూ.750 కోట్ల పెట్టుబడిని రెండు దశలో పెడుతున్నారని వివరించారు. పదేళ్లలో పది వేల ఉద్యోగాలను అంతర్జాతీయ సంస్థ హెచ్సీఎల్ ఒక్కటే కల్పిస్తున్నట్టు వివరించారు. తాజాగా శంకుస్థాపన చేసిన మొదటి భవనాన్ని ఏడాదిలోపు పూర్తి చేసి కార్కకలాపాలను ప్రారంభించనుందని తెలిపారు. ఇక్కడ నైపుణ్యాభివృద్ధి శిక్షణ కేంద్రాన్ని కూడా హెచ్సీఎల్ ఏర్పాటు చేసి స్థానిక యువతకు శిక్షణ అందించనుందని వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్లో హెచ్సీఎల్ కొత్త ప్రాంగణం ఏర్పాటు సంతోషదాయకమని సంస్థ సీఈవో రోషిణి నాడార్ పేర్కొన్నారు. భవిష్యత్తులో ఈ ప్రాంగణం ఐటీ రంగంలోని అత్యుత్తమమైన వాటిలో ఒకటిగా ఎదుగుతుందనే నమ్మకం ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి కొల్లు రవీంద్ర, ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, హెచ్సీఎల్ కార్యనిర్వాహక ఉపాధ్యక్షురాలు శ్రీమతి శివశంకర్, ముఖ్య మానన వనరుల అధికారి వి.వి.అప్పారావు తదితరులు పాల్గొన్నారు.













