మాట మీదే ఉన్నానంటున్న గంటా.. త్వరలో మరింత యాక్టివ్
తన రాజీనామా విషయంపై వెనక్కు తగ్గే ప్రసక్తే లేదని టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు స్పష్టం చేశారు. ఇదే విషయాన్ని స్పీకర్ తమ్మినేని సీతారాం దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు. ఇవాళ్ శ్రీకాకుళం అరసవెల్లి సూర్యనారాయణ స్వామి దర్శనం అనంతరం గంటా శ్రీనివాసరావు స్పీకర్ తమ్మినేనితో భేటీ అయ్యారు. తన రాజీనామాను ఆమోదించాలని విజ్ఞప్తి చేశారు. అయితే అమరావతి వెళ్లి పరిశీలించిన తర్వాత నాలుగు రోజుల్లో నిర్ణయం ప్రకటిస్తానని స్పీకర్ చెప్పారని గంటా వివరించారు.
విశాఖ స్టీల్ ప్లాంట్ తెలుగు ప్రజల గుండె చప్పుడన్నారు గంటా. దాన్ని ప్రైవీటికరించడానికి కేంద్ర ప్రభుత్వం పూర్తిస్థాయిలో సిద్దమైందని.. దీన్ని అడ్డుకోకపోతే స్టీల్ ప్లాంట్ మనుగడ ఉండదని చెప్పారు. ప్రధాని మొదలు మంత్రుల వరకూ అందరూ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై ఒకే మాట మీద ఉన్నారన్నారు. స్టీల్ ప్లాంట్ ను అడ్డుకునేందుకు రాజీనామాలు మాత్రమే చివరి అస్త్రాలని గంటా స్పష్టం చేశారు. ఇప్పుడు అలాంటి సందర్భం వచ్చిందన్నారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులతో పాటు సీఎం కూడా రాజీనామా చేయాల్సిన అవసరం ఏర్పడిందన్నారు గంటా. అందరూ ఒకే స్థాయిలో రాజీనామాలు చేస్తే ఢిల్లీ స్థాయిలో చర్చ జరుగుతుందన్నారు. వయసులో పెద్దవాడైనప్పటికీ స్టీల్ ప్లాంట్ అంశంలో సీఎం జగన్ తో కలిసి పని చేసేందుకు చంద్రబాబు సిద్ధమయ్యారని.. కాబట్టి ఈ విషయంలో జగన్ చొరవ తీసుకుని స్టీల్ ప్లాంట్ వ్యతిరేక ఉద్యమాన్ని ముందుకు నడిపించాలని కోరారు.
విశాఖ స్టీల్ ప్లాంట్ వ్యతిరేక పోరాటానికి టీఆర్ఎస్ నేత, తెలంగాణ మంత్రి కేటీఆర్ మద్దతు ప్రకటించడం అభినందనీయమన్నారు ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు. అందుకే తెలంగాణ సచివాలయంలో ఆయన్ను కలిసి కృతజ్ఞతలు తెలిపానన్నారు. స్టీల్ ప్లాంట్ ను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని కేటీఆర్ వివరించారన్నారు. అంతేకాక.. స్టీల్ ప్లాంట్ వ్యతిరేక ఉద్యమంలో ప్రత్యక్షంగా కూడా పాల్గొంటానన్నారని.. 26వ తేదీ అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తర్వాత కేటీఆర్ విశాఖ వచ్చే అవకాశం ఉందన్నారు గంటా.
విశాఖ స్టీల్ ప్లాంట్ వ్యతిరేక ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు త్వరలో నాన్ పొలిటికల్ జేఏసీని ఏర్పాటు చేయనున్నట్లు గంటా ప్రకటించారు. ఉద్యమాన్ని ఒక పార్టీ లీడ్ చేస్తే.. మరోపార్టీ కలిసి పని చేయకపోవచ్చన్నారు. అందుకే పార్టీలకు అతీతంగా జేఏసీని ఏర్పాటు చేయాలనుకుంటున్నట్టు తెలిపారు. ఇందుకోసం ఇప్పటికే ఉండవల్లి అరుణ్ కుమార్, సీబీఐ మాజీ జేడీ లక్ష్మినారాయణ తదితరులతో చర్చించినట్లు గంటా వివరించారు. త్వరలోనే ఇది సాకారమవుతుందని భావిస్తున్నట్టు చెప్పారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కు వ్యతిరేకంగా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన మొదటి వ్యక్తి గంటా. దీన్ని ఎలాగైనా కాపాడుకోవాలనే ఉద్దేశంతో ఆయన ఉద్యమ కార్యాచరణ రూపొందిస్తున్నారు. మరి ఆయన ప్రయత్నాలు ఫలిస్తాయో.. లేదో వేచి చూడాలి.













