టీడీపీలోకి మాజీ ఎంపీ హర్షకుమార్?
ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికలు సమయం దగ్గరపడుతున్న కొద్దీ రాజకీయ పార్టీల్లో వలసలు ఊపందుకున్నాయి. ఏప్రిల్ 11న తేదీన అటు అసెంబ్లీ, ఇటు పార్లమెంటుకు ఒకేసారి ఎన్నికలు జరుగుతున్న తరుణంలో అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య సీటు రాజకీయాలు దోబూచులాడుతున్నాయి. తూర్పు గోదావరి జిల్లాలోని అమలాపురం సిట్టింగ్ ఎంపీ రవీంద్రబాబు గత నెల టీడీపీని వీడీ వైసీపీ తీర్థం పుచ్చుకోవడం జరిగింది. దీంతో ఖాళీ ఏర్పడిన ఆ స్థానానికి మరింత బలమైన అభ్యర్థిని బరిలోకి దించి అత్యధిక మెజారిటీతో గెలవడం ద్వారా సత్తాచాటాలని టీడీపీ భావిస్తోంది. ఈ నేపథ్యంలో అమలాపురం లోక్‌సభ సభ్యుడిగా అఖండ మెజారిటీతో గెలిచిన జి.వి.హర్షకుమార్‌పై తెలుగుదేశం పార్టీ దృష్టి సారించింది.
అమలాపురం ప్రజలకు ఆత్మీయుడిగా పేరుగాంచిన హర్షకుమార్ టీడీపీలోకి వస్తే అక్కడ గెలుపు నల్లేరుపై నడకే అని భావించిన టీడీపీ అధిష్టానం ఆయన చేరికకు లైన్ క్లియర్ చేస్తూ స్థానిక మంత్రులు యనమల రామకృష్ణుడు, చినరాజప్పలను రంగంలోకి దింపింది. దీనితో వారు హర్షకుమార్‌తో భేటీ నిర్వహించడంతోపాటు సీఎం చంద్రబాబుతో కూడా ప్రత్యేక భేటీ ఏర్పాటు చేశారు. దీనితో హర్షకుమార్ టీడీపీ తీర్థం పుచ్చుకోవడం దాదాపుగా ఖాయమైంది. మరో ఒకటి, రెండు రోజుల్లో ఆయన తన అనుచరులు, బంధు మిత్రులతో కలిసి తెలుగుదేశం పార్టీలో చేరిన తరువాత సీఎం చంద్రబాబు అమలాపురం ఎంపీ అభ్యర్థిగా ఆయనను ప్రకటించే అవకాశం ఉంది.













