మాజీ మంత్రి గాదె వెంకటరెడ్డి ఇకలేరు
మాజీ మంత్రి, సీనియర్ రాజకీయ నాయకుడు గాదె వెంకటరెడ్డి (Gade Venkata Reddy) (84) ఇకలేరు. కొంతకాలంగా వయోభారం, అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్ లోని తన నివాసంలో కన్నుమూశారు. వెంకటరెడ్డి 1940 జూలై 10న అప్పటి గుంటూరు జిల్లా(ప్రస్తుతం బాపట్ల జిల్లా), ఇంకొల్లు మండలం, పావులూరు గ్రామంలో జన్మించారు. ఎల్.ఎల్.బి. (LLB) పూర్తి చేసి న్యాయవాదిగా జీవితాన్ని ప్రారంభించారు.
1967లో పర్చూరు (Parchur) నుంచి తొలిసారిగా ఐఎన్‌సీ తరఫున పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. 1972, 1978 ఎన్నికల్లో ఓడిపోయిన ఆయన, 1991 ఉపఎన్నిక, 1994లో పర్చూరు నుంచి మళ్లీ గెలిచారు. నేదురుమల్లి జనార్దన్‌రెడ్డి, కోట్ల విజయభాస్కర్ రెడ్డి (Vijayabhaskar Reddy) మంత్రివర్గాల్లో పనిచేశారు. 2004, 2009 ఎన్నికల్లో బాపట్ల ఎమ్మెల్యేగా గెలిచారు. వైఎస్ఆర్, రోశయ్య హయాంలో మంత్రిగా చేశారు. 2016లో కాంగ్రెస్‌కు రాజీనామా చేసి టీడీపీలో చేరారు. 2020లో వైసీపీ కండువా కప్పుకున్నారు. గాదె మృతదేహాన్ని శనివారం స్వగ్రామం పావులూరుకు తరలించి, ఆదివారం అంత్యక్రియలు నిర్వహించనున్నారు.







