విశాఖలో మహిళా పారిశ్రామికవేత్తల సదస్సు

ఫిక్కీ లేడీస్ ఆర్గనైజేషన్ (ఎఫ్ఎల్ఓ) ఆధ్వర్యంలో 20వ అంతరాష్ట్ర మహిళా ఔత్సాహిక పారిశ్రామికవేత్తల సదస్సు నవంబరు 25 నుంచి 27 వరకూ విశాఖపట్నంలో జరగనుంది. 15 రాష్ట్రాల నుంచి 180 మంది మహిళా పారిశ్రామికవేత్తలు, నిపుణులు ఈ సదస్సులో పాలుపంచుకుంటారని ఎఫ్ఎల్ఓ జాతీయ అధ్యక్షురాలు పింకీ రెడ్డి తెలిపారు. పారిశ్రామికవేత్తలు తమ అనుభవాలను ఇతరులతో పంచుకోవడంతోపాటు, వ్యాపార అభివృద్ధికి కావాల్సిన సలహాలు ఇచ్చిపుచ్చుకునేందుకు ఈ వేదిక ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. ఎఫ్ఎల్ఓ హైదరాబాద్ విభాగం చైర్ పర్సన్ ప్రియాంక జెనిర్వాల్ అరోరా 20 ఏళ్ల నుంచి అంతరాష్ట్ర మహిళా పారిశ్రామికవేత్తల సదస్సులను నిర్వహిస్తున్నామని తెలిపారు. హైదరాబాద్ విభాగం ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం ఇది మూడోసారని అన్నారు. ఈ మూడు రోజుల సదస్సులో భాగంగా వివిధ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్, ప్రభుత్వ ఉన్నతాధికారులు హాజరవుతారని పేర్కొన్నారు.











































































