ధార్మిక పరిషత్ కు మాత్రమే ఆ అధికారం
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్రంలో 21 మంది సభ్యులతో పూర్తిస్థాయి ధార్మిక పరిషత్‌ను ఏర్పాటు చేసినట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ తెలిపారు. సచివాయలంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ సీజీఎఫ్ కమిటీని పూర్తి స్థాయిలో నియమించామన్నారు. గతంలో నలుగురు మాత్రమే ఉన్నారు. అందులో మరో ముగ్గురిని చేర్చాం. కలికి కోదండరామిరెడ్డి, మలిరెడ్డి వెంకటపాపారావు, కర్రి భాస్కరరావులను సభ్యులుగా నియమించాం. హిందూ ధర్మ పరిరక్షణ కోసమే ఈ కమిటీలను నియమించామన్నారు. టీడీపీ ప్రభుత్వంలో కోట్లాది రూపాయల ఆస్తులు అన్యాక్రాంతం అయినా పట్టించుకోలేదు. కొన్ని మఠాలలో ఆక్రమాలు జరిగినా చర్యలు తీసుకోలేదు. ధార్మిక పరిషత్‌కి మాత్రమే ఆ ఆధికారం ఉంటుంది. దేవాదాయశాఖలో ధార్మిక పరిషత్ నిర్ణయాలే కీలకం అన్నారు.
కనీసం గ్రామానికి ఒక దేవాలయానికి దూప, దీప నైవేధ్యం పథకం అమలు చేసేలా చర్యలు తీసుకుంటాం. అన్ని జిల్లాల అధికారులకు దరఖాస్తులను పరిశీలించాలని కోరామన్నారు. దీని ద్వారా ప్రతి గ్రామంలో హిందూ దేవాలయాలను పరిక్షించే బాధ్యతను తీసుకున్నాం. ట్రిబ్యునల్ కేసులకు సంబంధించిన వెబ్‌సైట్‌ను ఏర్పాటు చేస్తున్నాం. దేవాలయాలకు 4 లక్షల 9 వలే ఎకరాల భూములున్నాయి. వాటిలో కొన్ని ఆక్రమణలో ఉన్నాయి. వాటిని తొలగించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.













