MLA Nallamilli : ఆయనకు దేనిపైనా అవగాహన లేదు : ఎమ్మెల్యే నల్లమిల్లి
వైసీపీ హయాంలో ధాన్యం కొనుగోలు, సాగునీరు, ఎరువుల సరఫరా విషయాల్లో రైతులకు చేసిన మేలేంటో చెప్పాలని అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి (Nallamilli Ramakrishna Reddy) ప్రశ్నించారు. వైసీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే సూర్యనారాయణరెడ్డి (Suryanarayana Reddy) చేసిన విమర్శలపై ఆయన స్పందించారు. తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలో నిర్వహించిన మీడియా సమావేశంలో రామకృష్ణారెడ్డి మాట్లాడారు. బహిరంగ చర్చకు రావాలని ఎన్నిసార్లు అడిగినా మాజీ ఎమ్మెల్యే సమాధానం చెప్పరు. కేవలం వీడియోలు (Videos) మాత్రమే చేస్తారు. ఆయన ప్రచారాలతో గందరగోళ వాతావరణం నెలకొంది. నియోజకవర్గంలో యూరియా (Urea) కొరత లేదు. నాలుగు మండలాలకు సంబంధించి మొదటి విడత 2,918 మొట్రిక్ టన్నుల యూరియా అవసరమైతే, ఇప్పటికే 2,173 మెట్రిక్ టన్నులు రైతులకు అందించాం. రాసిచ్చిన స్క్రిప్టులు చదవడం తప్ప మాజీ ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డికి దేనిపైనా అవగాహన లేదు. ఒకేసారి రైతులకు యూరియా ఇవ్వాలని మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతున్నారు. వైసీపీ నేతలు చెప్పే మాటలను రైతులు పరిగణనలోకి తీసుకోవద్దు. ధాన్యం కొనుగోలు సక్రమంగా సాగుతోంది. రూ.14. వేల కోట్లతో ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేస్తుంది. 24 గంటల్లో రైతుల ఖాతాల్లో డబ్బు జమ అవుతోంది అని అన్నారు.






