సామాజిక న్యాయం కోసమే…. ద్రౌపదీ ముర్మకు మద్దతు
ఆదివాసీలను ఉన్నత స్థానాల్లో తేవడం అరుదుగా జరుగుతుందని, గిరిజన కుటుంబంలో పుట్టిన ద్రౌపదీ ముర్మును ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపిక చేసిందని తెలిశాక, సామాజిక న్యాయం కోసం ఆమెకు మద్దతివ్వాలని నిర్ణయించామని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. ఆమె అభ్యర్థిత్వాన్ని బలపరచడాన్ని గర్వకారణంగా భావిస్తున్నామని అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చిన ద్రౌపదీ ముర్ము విజయవాడలో తెలుగుదేశం పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సమవేశమయ్యారు. దీనికి ముందు టీడీపీ నాయకులు ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో సమావేశమైన రాష్ట్రపతి ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం, ముర్ము అభ్యర్థిత్వాన్ని బలపరచాల్సిన అవసరం గురించి చర్చించారు.
అనంతరం సమవేశం జరిగే హోటల్‌కు చేరుకున్నారు. ముర్ముకు చంద్రబాబు ఎదురెళ్లి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ ముర్మును ఎంపిక చేసిన ప్రధాని నరేంద్ర మోదీని అభినందిస్తున్నాను. టీడీపీ ఎంతో బాధ్యతగా ఆలోచించి ఆమెకు మద్దతివ్వాలని నిర్ణయించింది అని అన్నారు. రాష్ట్రపతి అభ్యర్థిగా మీ ఎంపిక బలహీనవర్గాలకు గర్వకారణం. టీడీపీ తరపున మీకు సంపూర్ణ సహకారం అందిస్తాం అని ముర్ముతో చెప్పారు.













