ఈ కేసులో సూత్రధారులెవరో.. పాత్రధారులెవరో తెలుసు : డీఎల్
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో పులివెందులకు చెందిన వైసీపీ నేతల ప్రమేయాన్ని కప్పిపుచ్చుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారని మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి విమర్శించారు. కడప జిల్లా ఖాజీపేటలో ఆయన మీడియాతో మాట్లాడుతూ వివేకా హత్య కేసును సీబీఐ నిష్పక్షపాతంగా దర్యాప్తు చేస్తోందన్నారు. ఈ కేసులో ఇద్దరు పెద్దల హస్తం ఉందని ప్రచారం జరుగుతోందని, దీనిపై సీబీఐ నిగ్గు తేల్చాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. వివేకా హత్య కేసును సీబీఐ నిష్ఫక్షపాతంగా దర్యాప్తు చేస్తోందన్నారు. వివేకా హత్య కేసులో సునీత కుటుంబం ప్రమేయం లేకపోయినా వారిపై నెపం నెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. సొంత బాబాయి దారుణహత్యకు గురైతే సీఎం జగన్ ఆ రోజు సాయంత్రం వరకు పులివెందుకు ఎందుకు రాలేదని ప్రశ్నించారు. వివేకా హత్య కేసులో నిందితులు ఎవరైనా సరే తప్పించుకోలేరని అన్నారు. వివేకా హత్యకేసులో సూత్రధారులెవరో, పాత్రధారులెవరో అందరికి తెలుసన్నారు. ఈ కేసులో ఎంపీ అవినాష్ రెడ్డి, వైఎస్ భాస్కర్ రెడ్డిలకు తప్పకుండా శిక్షపడుతుందని అన్నారు.













