Chandrababu: ఏడాదిలోగా ప్రజల డిజిటల్ హెల్త్ రికార్డులు: సీఎం చంద్రబాబు
రాష్ట్ర ప్రజల డిజిటల్ హెల్త్ రికార్డులను సంజీవని ప్రాజెక్టు ద్వారా రూపొందిస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) తెలిపారు. రాష్ట్ర సచివాలయంలో ఆరోగ్యశాఖపై సీఎం సమీక్ష నిర్వహించారు. గేట్స్ ఫౌండేషన్‌తో కలిసి ఆరోగ్య రంగంలో ప్రభుత్వం అమలు చేస్తున్న సంజీవని సహా వివిధ ప్రాజెక్టులపై చర్చించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ ఏడాదిలోగా డిజిటల్ హెల్త్ రికార్డులను (Digital health records) సిద్ధం చేస్తామన్నారు ప్రజారోగ్య పరిరక్షణకు మెరుగైన విధానాలతో సేవలు అందించాలనే లక్ష్యంతో పని చేస్తున్నామన్నారు. ప్రపంచవ్యాప్తంగా అందుబాటులో ఉన్న టెక్నాలజీని వినియోగించుకోవడంతో పాటు నిపుణుల సలహాలను తీసుకోవాలని సూచించారు. గేట్స్ ఫౌండేషన్ సహకారంతో కుప్పం, చిత్తూరు జిల్లాల్లో(Chittoor District) డిజిటల్ నెర్వ్ సెంటర్ ద్వారా ఈ వివరాలను సేకరించి ఇంటిగ్రేట్ చేశామని, రియల్ టైమ్‌లోనే వారి వివరాలు తెలుసుకునేలా సంజీవని ప్రాజెక్టు పని చేస్తుందని చెప్పారు. త్వరలో రాష్ట్రవ్యాప్తంగా దీనిని అమలు చేస్తామన్నారు.
ఆరోగ్య సమస్యల పరిష్కారానికి యోగాతో పాటు నేచురోపతిని ప్రోత్సహించాలి. ఆరోగ్య రంగంలో మౌలిక సదుపాయాలు పెద్దఎత్తున పెరగాలి. మెడ్‌టెక్ పార్కు ద్వారా అధునాతన వైద్య పరికరాలను రూపొందిస్తున్నాం. వ్యాధులను నివారించే విధానాలపై దృష్టి పెడితే ప్రజల వైద్య ఖర్చులు చాలా వరకూ తగ్గుతాయి. వారి ఆరోగ్యం కూడా బాగుంటంది. వైద్యారోగ్య రంగంలో మరింత వినూత్నంగా ప్రాజెక్టులు చేపట్టేందుకు అత్యున్నత స్థాయి నిపుణుల బృందం సలహాలివ్వాలని కోరుతున్నాం. ముంబైలో త్వరలో గ్లోబల్ ఏఐ కన్వెన్షన్ (Global AI Convention) జరుగనుంది. ఇందులో వైద్యారోగ్యంలో టెక్నాలజీ వినియోగంపై ప్రభుత్వం రూపొందిస్తున్న విధానాలను ప్రదర్శించాలని ఆలోచన చేస్తున్నాం. దీనికి అనుగుణంగా ప్రణాళిక సిద్ధం చేయాలని నిపుణులను కోరుతున్నా అని చెప్పారు.






