టీడీపీలో బోండా ఉమా వివాదానికి ఎండ్ కార్డ్..!
తెలుగుదేశం పార్టీలో గత కొన్ని రోజులుగా చర్చనీయాంశంగా మారిన ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు(Bonda Uma) వ్యవహారానికి ఎట్టకేలకు తెరపడింది. బోండా ఉమా ఇచ్చిన వివరణపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు స్పందించారు. ఈ సందర్భంగా ఆయన పార్టీ క్రమశిక్షణను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. బోండా ఉమా అంశం ఇక ముగిసిన అధ్యాయమని స్పష్టం చేస్తూనే, పార్టీ గీత దాటితే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని కఠిన హెచ్చరికలు జారీ చేశారు.
పల్లా శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ, తెలుగుదేశం పార్టీకి క్రమశిక్షణే అతిపెద్ద బలమని కొనియాడారు. “పార్టీ కంటే ఎవరూ గొప్పవారు కాదు. అధినేత ఆదేశాలు, పార్టీ నిర్ణయాలే అందరికీ మార్గదర్శకం” అని ఆయన స్పష్టం చేశారు. పార్టీ ప్రతిష్ఠకు భంగం కలిగించేలా ప్రవర్తించినా, వ్యాఖ్యలు చేసినా చూస్తూ ఊరుకోబోమని.. అవసరమైతే ఎంతటి సీనియర్ నేతపైనైనా కఠిన చర్యలు తీసుకునేందుకు పార్టీ వెనుకాడదని గట్టి సంకేతాలు పంపారు. ఇతర పార్టీల నేతలతో వేదికలు పంచుకునే విషయంలో ముఖ్యమంత్రి, పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu) స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారని పల్లా శ్రీనివాస్ గుర్తుచేశారు.
కూటమి ధర్మాన్ని లేదా పార్టీ నియమాలను విస్మరించి వేరే పార్టీల వారితో అనవసరంగా వేదికలు పంచుకోవద్దని సీఎం గతంలోనే చెప్పారని పేర్కొన్నారు. ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో హాజరుకావాల్సి వస్తే.. కేవలం ఆ కార్యక్రమానికి మాత్రమే పరిమితం కావాలి తప్ప, పార్టీ లైన్ దాటి మాట్లాడకూడదని హితవు పలికారు. ఇటీవలి పరిణామాలపై బోండా ఉమా ఇచ్చిన వివరణపై పార్టీ నాయకత్వం సంతృప్తి వ్యక్తం చేసిందని పల్లా శ్రీనివాస్ వెల్లడించారు. అధినేత చంద్రబాబు మాట దాటే ప్రసక్తే లేదని, పార్టీ క్రమశిక్షణకు కట్టుబడి ఉంటానని బోండా ఉమా స్వయంగా స్పష్టం చేయడంతో ఈ వివాదాన్ని ఇక్కడితో ముగిస్తున్నట్లు ప్రకటించారు. ఈ పరిణామంతో టీడీపీలో అంతర్గతంగా చెలరేగిన చిన్నపాటి వివాదానికి పూర్తిస్థాయిలో బ్రేక్ పడినట్లయింది.








