కడప ఉక్కు పరిశ్రమకు సీఎం శంకుస్థాపన
పారిశ్రామిక రంగంలో కడప జిల్లా పరుగులు పెట్టాలని కలలు కన్నానని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. జిల్లా పర్యటనలో ఉన్న ఆయన సున్నపురాళ్లపల్లెలో నిర్మించనున్న ఉక్కు కర్మాగారానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ వైఎస్ రాజశేఖర్రెడ్డి తర్వాత కడప జిల్లాను పట్టించుకునేవారు కరవయ్యారన్నారు. గతంలో ఎన్నికలకు కేవలం 6 నెలల ముందు టెంకాయ కొట్టి మోసం చేశారని విమర్శించారు. అధికారంలోకి వచ్చిన 6 నెలల్లో చేస్తే దానిని చిత్తశుద్ధి అంటారని పేర్కొన్నారు. రాయలసీమకు మంచి జరగాలంటే నీళ్లు, పరిశ్రమలు ఉద్యోగాలు రావాలని అన్నారు.
కడప ఉక్కు కర్మాగారానికి శంకుస్థాపన చేయడం చాలా సంతోషంగా ఉంది. మూడేళ్లలో ఈ పరిశ్రమ పూర్తి చేస్తాం. రూ.15వేల కోట్లతో ఉక్కు పరిశ్రమకు పునాది రాయి వేసుకున్నాం. ఈ పరిశ్రమ ఇక్కడి రావడానికి ఎన్ఎండీసీతో ముందడుగు వేశాం. రాష్ట్రం విడిపోయాక 5 ఏళ్లపాటు చూశాం. ఎవ్వరూ పట్టించుకోలేదని అని ముఖ్యమంత్రి అన్నారు. కడపకు న్యాం జరిగే రోజులు మళ్లీ వచ్చాయని ఈ సందర్భంగా జగన్ వ్యాఖ్యానించారు.













