గ్రామాలు అభివృద్ధి చెందితేనే దేశాభివృద్ధి సాధ్యం : చంద్రబాబు
పేద ప్రజలకు న్యాయం జరిగే పాలనకు శ్రీకారం చుట్టామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. అంబేడ్కర్ కోనసీమ జిల్లా కొత్త పేట మండలం వానపల్లిలో సీఎం పర్యటించారు. ఈ సందర్భంగా స్వర్ణ వానపల్లి గ్రామసభకు హాజరై ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఒకే రోజు 13,326 పంచాయతీల్లో గ్రామసభలు పెట్టి, ఈ ఏడాది నరేగా కింద రూ.4,500 కోట్ల పనులకు అనుమతి తీసుకున్నాం. నరేగా కింద వంద రోజుల పని కల్పించడం ప్రభుత్వ బాధ్యత. ఈ పథకం కింద ఈ ఏడాది 84 లక్షల కుటుంబాలకు పని దొరుకుతుంది.గ్రామాలు అభివృద్ధి చెందితేనే దేశాభివృద్ధి సాధ్యం. 2014-19 మధ్య గ్రామాభివృద్ధికి స్వర్ణయుగం. గ్రామాభివృద్ధిలో సర్పంచి పాత్ర కీలకం అని అన్నారు.
గత ప్రభుత్వంలో గ్రామాల్లో అభివృద్ధి జరగలేదు. 2014-19 మధ్య 27,444 కిలోమీటర్ల మేర సిమెంటు రోడ్లు వేశాం. వచ్చే ఐదేళ్లలో ప్రతి గ్రామంలో సిమెంటు రోడ్లు వేస్తాం. పశువుల షెడ్లు నిర్మించుకునేందుకు ఆర్థిక సాయం చేస్తామన్నారు. గ్రామాల్లోని పేదలకు ఇళ్లు కటించే బాధ్యత తీసుకుంటాం. ఇళ్లకు విద్యుత్, సురక్షిత తాగునీరు ఇచ్చే బాధ్యత మాది. వైసీపీ పాలనకు, మా పాలనకు బేరీజు వేయండి. మా హయాంలో వేసిన వీధిదీపాలను కూడా వైసీపీ నేతలు దొంగలించుకుపోయారు. వైసీపీ భూతాన్ని పూర్తిగా భూ స్థాపితం చేస్తేనే రాష్ట్రాభివృద్ధి సాధ్యం. కేంద్రం సాయంతో గ్రామాలను అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తాం. నిరుద్యోగ యువతకు ఉపాధి ఎలా కల్పించాలనే ఎప్పుడూ ఆలోచిస్తూంటా. 16వేలకు పైగా ఉపాధ్యా పోస్టులు భర్తీ చేస్తున్నాం అని చంద్రబాబు తెలిపారు.













