Chandrababu: కేబినెట్ చేర్పులపై చంద్రబాబు క్లారిటీ..నేతలకు తప్పని వెయిటింగ్..

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాజకీయ వర్గాల్లో మంత్రివర్గ కూర్పు చేర్పులపై మరోసారి చర్చలు మొదలయ్యాయి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) తాజాగా పార్టీ కీలక నేతలతో నిర్వహించిన టెలీ కాన్ఫరెన్స్‌లో ఇప్పటికిప్పుడు మార్పులు ఉండబోవని స్పష్టంగా చెప్పినట్టు సమాచారం. గత కొంతకాలంగా ఈ అంశం రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఉగాది సమయానికి కొత్త నాయకులను మంత్రివర్గంలోకి తీసుకుంటారని వార్తలు వచ్చాయి. ముఖ్యంగా జనసేన (Janasena) నుంచి నాగబాబు (Nagababu), అలాగే టిడిపి (TDP)లోని ఇద్దరు సీనియర్ నాయకులను కూడా కేబినెట్‌లో చేర్చుతారని ప్రచారం బలంగా జరిగింది. కానీ అనుకోకుండా ఈ ప్రక్రియ ఎప్పటికప్పుడు వాయిదా పడుతోంది.
వాస్తవానికి ఎన్నికల సమయంలోనే మోపిదేవి వెంకటరమణ (Mopidevi Venkataramana) వైఎస్ఆర్ కాంగ్రెస్ (YSR Congress) విడిచి టిడిపిలో చేరారు. ఆయన రాజ్యసభ సభ్యత్వం నుంచి రాజీనామా చేసి సైకిల్ చిహ్నం ఎంచుకున్నారు. ఆ సమయంలోనే ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చి మంత్రివర్గంలో చోటు కల్పిస్తామని వాగ్దానం చేసినట్టు ప్రచారం జరిగింది. అలాగే కృష్ణా జిల్లా (Krishna District)కి చెందిన ఒక సీనియర్ కమ్మ నాయకుడికి కూడా పదవి ఇస్తారని అప్పట్లో వార్తలు వచ్చాయి. ఈ క్రమంలో మొత్తం ముగ్గురి నుంచి నలుగురి వరకు కొత్తగా కేబినెట్‌లోకి వచ్చే అవకాశముందని భావించారు. అయితే ఇప్పుడు పరిస్థితులు అలా లేవని స్పష్టమవుతోంది.
ప్రస్తుతం ప్రభుత్వంపై ప్రజల్లో మంచి అభిప్రాయం ఏర్పడుతోందని, ముఖ్యంగా సంక్షేమ పథకాలు సానుకూల ఫలితాలు ఇస్తున్నాయని చంద్రబాబు అనుకుంటున్నారు. ఇలాంటి సమయంలో మంత్రివర్గంలో మార్పులు చేస్తే చర్చలు ఇతర దిశలో వెళ్లి, ప్రభుత్వం చేస్తున్న పనులపై దృష్టి తగ్గే అవకాశం ఉందన్నది ఆయన ఆలోచన. ఒకరిద్దరు మంత్రుల పనితీరుపై అసంతృప్తి ఉన్నప్పటికీ ప్రజలలో సానుకూల వాతావరణం ఉండటంతో మార్పు చేర్పులు అవసరం లేదని ఆయన భావిస్తున్నట్టు పార్టీ వర్గాల సమాచారం.
ఇదే విషయాన్ని చంద్రబాబు ఇటీవల నేతలతో చర్చిస్తూ, మరో ఏడాది తర్వాతే మార్పు చేసే అవకాశముందని సూచించినట్టు చెబుతున్నారు. అంటే ప్రభుత్వం ఏర్పడి కనీసం రెండున్నర సంవత్సరాలు పూర్తయిన తర్వాతే కొత్త సభ్యులు కేబినెట్‌లోకి వచ్చే అవకాశముందని అర్థం. ఈ ప్రకటనతో మంత్రివర్గంలో స్థానం ఆశిస్తున్న నేతలు నిరాశ చెందవలసిన పరిస్థితి ఏర్పడింది. వచ్చే ఏడాది ఉగాది వరకు వారికి ఎదురు చూడక తప్పదని పార్టీ నేతలు అంటున్నారు. అందువల్ల ఇప్పట్లో మార్పులు లేవని, కేబినెట్‌లో కొత్తవారికి అవకాశం రావాలంటే సమయం పట్టనుందని టిడిపి వర్గాల్లో స్పష్టత వచ్చింది. చంద్రబాబు వ్యూహం ప్రకారం, ప్రస్తుత సానుకూల వాతావరణాన్ని కొనసాగించడమే ప్రాధాన్యం, మార్పులు మాత్రం తర్వాత కాలంలోనే ఉంటాయనేది స్పష్టమవుతోంది.