దేవుడు దేవుడే… మనిషి మనిషే : చంద్రబాబు నాయుడు
టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురువారం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు. రాష్ట్రానికి శుభం కలగాలని దేవుడ్ని ప్రార్థించానని చంద్రబాబు తెలిపారు. శ్రీవారి ఆలయ పవిత్రతను కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందని అన్నారు. అయితే ప్రధాన అర్చకుడు రమణ దీక్షితులు చేసిన కామెంట్స్ పై చంద్రబాబు తీవ్ర అభ్యంతరం తెలిపారు. దేవుడు… దేవుడే… మనిషి.. మనిషే…. దేవుడితో మనిషిని పోల్చడం ఏంటని తీవ్రంగా మండిపడ్డారు. ఇలాంటి అపచారాలు గతంలో కూడా జరిగాయని గుర్తు చేశారు. పింక్ డైమండ్ మాయమైందంటూ ఆరోపణలు చేసిన వ్యక్తిని, తిరిగి విధుల్లో నియమించడం సంప్రదాయం కాదని, అలా చేయడం వల్ల హిందువుల మనోభావాలు దెబ్బతింటాయని అన్నారు. ఏపీ రాష్ట్రానికి అతిపెద్ద ఆస్తి శ్రీ వేంకటేశ్వర స్వామేనని, తిరుమల పవిత్రతను కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందని గుర్తు చేశారు. ధర్మాన్ని కాపాడితే, అది అందర్నీ కాపాడుతుందనని చంద్రబాబు పేర్కొన్నారు.
ఇంతకీ రమణ దీక్షితులు ఏమన్నారంటే…
టీటీడీ ప్రధాన అర్చకులుగా తిరిగి బాధ్యతలు స్వీకరించిన నేపథ్యంలో రమణ దీక్షితులు ముఖ్యమంత్రి జగన్ను కలిశారు. వంశపారంపర్య హక్కులు కల్పించినందుకు ధన్యవాదాలు ప్రకటించారు. ‘‘సీఎం జగన్ విష్ణుమూర్తిలా ధర్మాన్ని రక్షిస్తున్నారు. అర్చకుల కుటుంబాలకు భూములు ఇవ్వాలని కోరాం. తిరుమలలో అన్యమత ప్రచారం లేదు. టీటీడీ విషయాలను మాత్రం రాజకీయం చేయడం తగదు.’’ అంటూ రమణ దీక్షితులు వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలే ఇప్పుడు దుమ్ముదుమారం రేపుతున్నాయి.













