ఉల్లంఘించిన అన్ని అంశాలపై ఎదురు దెబ్బలు తగిలాయి : చంద్రబాబు

నిబంధనలు ఉల్లంఘించిన అన్ని అంశాలపై కోర్టుల్లో వైసీపీ ప్రభుత్వానికి ఎదురు దెబ్బలు తగిలాయని టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు విమర్శించారు. సుప్రీం ఆదేశాలు ఏమాత్రం పాటించకుండా పరిషత్ ఎన్నికలను జరిపారని, కొత్త ఎస్‌ఈసీని హడావుడిగా తీసుకొచ్చి, పోలింగ్ జరిపారని ఎద్దేవా చేశారు. నామినేషన్లు సరిగా ఉన్న వారివి కూడా తిరస్కరించారని, సీఎం జగన్ అహంభావంతోనే ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారని మండిపడ్డారు. టీడీపీ అధినేత చంద్రబాబు విలేకరులతో మాట్లాడారు. ప్రశ్నించిన వారందరిపై దాడులు చేస్తున్నారని, అసలు రాష్ట్రంలో ప్రభుత్వముందా? అని సూటిగా ప్రశ్నించారు. కోర్టు ఆదేశాలను అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి లేదా? అని నిలదీశారు. వైసీపీ ఎంపీ రఘురామపై దేశద్రోహం కేసు పెట్టారని, గతంలో జగన్ చేసిన వ్యాఖ్యలు దేశద్రోహం కిందికి రావా? అని ప్రశ్నించారు.
ఎంపీ అని చూడకుండా ఆయన్ను హింసించడం చాలా బాధాకరమని, రఘురామను పోలీసులు వేధించారన్న విషయం సుప్రీంలో నిరూపితమైందని వ్యాఖ్యానించారు. వైసీపీ ఎమ్మెల్యే కాకాణి పిలుపుతోనే కృష్ణపట్నంలో ప్రజలు గుమిగూడారని, ఆయుర్వేద వైద్యుడు ఆనందయ్యను వైసీపీ ప్రభుత్వం బెదిరింపులకు గురి చేసిందని ఆరోపించారు. ఆయుర్వేద మందుపై అధ్యయనం చేయాలి కానీ, మందును నిలిపేయడం ఏంటని ప్రశ్నించారు. ఏపీలో కరోనా విజృంభణ ఆందోళన కలిగిస్తోందని, ఆస్పత్రుల్లో ఆక్సిజన్ అందక ప్రజలు చనిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.