సీఎం చంద్రబాబుతో కేజ్రీవాల్ భేటీ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ భేటీ అయ్యారు. ఢిల్లీలోని ఏపీ భవన్ లో వీరిద్దరి భేటీ జరిగింది. రెండురోజులుగా చంద్రబాబు ఢిల్లీలోనే మకాం వేశారు. ఏపీకి ప్రత్యేక హోదా, విభజన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ టీడీపీ గత కొద్ది రోజులుగా పార్లమెంటు వేదికగా ఆందోళనకు దిగుతున్న సంగతి తెలిసిందే. అంతేగాక బీజేపీతో తెగతెంపులు చేసుకున్న టీడీపీ కేంద్రంపై అవిశ్వాసానికి నోటీసులిచ్చింది. అయితే చర్చకు వచ్చే అవకాశం లేకపోగా పార్లమెంటు వాయిదాల పర్వం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీకి వెళ్లి బీజేపీయేతర పార్టీల నాయకులను కలిసి తమ పోరాటానికి మద్దతు కూడగట్టే పనిలో పడ్డారు. నిన్న పలువురు నేతలను కలిసిన చంద్రబాబు నేడు కేజ్రీవాల్ తో భేటీ అయ్యారు. మోదీ సర్కార్‌పై కేజ్రీవాల్ తొలి నుంచి వ్యతిరేక భావనతోనే ఉన్నారు. రాష్ట్రాల హక్కులు, అధికారులు, నిధుల విషయంలో కేంద్రం తీరుపై ఆయన తరచు మండిపడుతుంటారు. చంద్రబాబు ఎన్డీయే కూటమిలో ఉన్నంత కాలం కేజ్రీవాల్ ఆయనతో ఎన్నడూ మాట్లాడింది లేదు. కానీ ఇటీవల ఎన్డీయే కూటమి నుంచి టీడీపీ వైదొలగడం, ఏపీకి దక్కాల్సిన ప్రయోజనాలపై కేంద్రంతో పోరాటం సాగిస్తున్న నేపథ్యంలో కేజ్రీవాల్ చంద్రబాబుతో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.













