కేడర్ హైరానా.. అధినేతల రిలాక్స్..
సుదీర్ఘ ఎన్నికల పోరాటం ముగియడంతో ఏపీలో ప్రధాన పార్టీల నేతలు..రిలాక్స్ అవుతున్నారు. ఎండనక, వాననక ప్రజల్లో పర్యటించి, గెలుపుకోసం తీవ్రంగా ప్రయత్నించిన సీఎంజగన్, కూటమి నేతలు.. ఇప్పుడు కాస్తా రిలాక్స్ గురూ అంటున్నారు. తమ కుటుంబ సభ్యులు, పిల్లలతో కలిసి సేద తీరేందుకు విదేశాలకు వెళుతున్నారు. సీబీఐ కోర్టు అనుమతితో ఏపీ సీఎం జగన్ మే 18న గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో లండన్ వెళ్లారు. ఎగ్జిట్ పోల్స్ విడుదలయ్యే జూన్ 1న జగన్ తిరిగి ఏపీలో అడుగుపెట్టనున్నారు. మరోవైపు, వైద్య పరీక్షల కోసం టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు సతీసమేతంగా మే 18వ తేదీ రాత్రి హైదరాబాద్ నుండి అమెరికాకు వెళ్లారు.
అయితే, జగన్ మాదిరి కాకుండా చంద్రబాబు అమెరికాలో వైద్య పరీక్షలు చేయించుకునేందుకు వెళ్లారు. వైద్య పరీక్షలు ముగించుకొని ఐదారు రోజుల్లో చంద్రబాబు, భువనేశ్వరి హైదరాబాద్ చేరుకుంటారు. మూడు నెలల పాటు ముమ్మరంగా ఎన్నికల ప్రచారం, సభలు, సమావేశాలు, రోడ్ షోలతో బిజీబిజీగా గడిపిన చంద్రబాబు ఇప్పుడే కాస్త రిలాక్స్ అవుతున్న సంగతి తెలిసిందే. వారణాసితోపాటు మహారాష్ట్రలోని పలు పుణ్యక్షేత్రాలను చంద్రబాబు, భువనేశ్వరి సందర్శించారు. ఇక, చంద్రబాబు తనయుడు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆల్రెడీ తన భార్య బ్రాహ్మణి, కుమారుడు దేవాన్ష్ తో కలిసి అమెరికా వెళ్లారు. లోకేష్ కూడా వారం రోజుల తర్వాత హైదరాబాద్ కు తిరిగి వచ్చే అవకాశముంది.
జనసేన అధినేత పవన్ కల్యాణ్ సైతం విదేశి పర్యటనకు సిద్ధమవుతున్నారని తెలుస్తోంది. ఈ నెలలో పవన్ విదేశాలకు వెకేషన్‌కు వెళ్లబోతున్నట్లు సమాచారం. ఆయన ఎక్కడికి వెళ్తాడనే దానిపై క్లారిటీ లేదు. అలాగే కుటంబసమేతంగా వేళ్తారా సింగిల్‌గా వెళ్తారా అనే విషయం కూడా తెలియరాలేదు. కానీ దాదాపు నెల రోజుల పాటు పవన్ విదేశాల్లో గడిపి జూన్ మధ్యలో తిరిగి వస్తారనేది టాక్ వినిపిస్తోంది. అయితే కేడర్ లో మాత్రం తమ పార్టీ గెలుస్తుందా ..? గెలిస్తే ఎన్ని సీట్లొస్తాయి. ప్రత్యర్థి పార్టీ పరిస్థితి ఏంటి..? ఓవేళ పార్టీ ఓడితే తమ పరిస్థితి ఏంటి అన్నటెన్షన్ కేడర్ ను మాత్రం వెంటాడుతోంది.దీంతో జూన్ 4 ఎప్పుడు వస్తుందా..? తమపార్టీ, తమ నేతల రాజకీయ భవితవ్యం ఎలా ఉండనుందన్న అంశం ఆసక్తికరంగా మారింది.













