AP Budget: బాబు బడ్జెట్ పై ఏపీ ఫుల్ ఫోకస్ ..
2024 ఎన్నికల గెలుపుతో ఆంధ్రప్రదేశ్‌కి చంద్రబాబు (Chandra Babu) నాలుగవసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఆయన రాజకీయ అనుభవం అర్థ శతాబ్దం దాటిపోగా, ముఖ్యమంత్రిగా మాత్రం 20 సంవత్సరాలు పూర్తి చేసుకోబోతున్నారు. ఇంత అనుభవం ఉన్న నేతలు దేశంలో చాలా తక్కువ. అయితే ఆయన తిరిగి అధికారం చేపట్టినప్పుడు రాష్ట్ర పరిస్థితి చాలా కష్టంగా ఉంది. ఒకపక్క భారీగా పెరిగిపోయిన అప్పులు.. మరోపక్క అంతంతమాత్రంగా ఉన్న ఆదాయం.. ఆకాశాన్ని తాకుతున్న ఖర్చులు. అందుకే అందరి దృష్టి కొత్త ప్రభుత్వం ప్రవేశపెట్టబోయే బడ్జెట్‌పై (AP Budget) ఉంది.
ఈసారి ఆర్థిక మంత్రిగా ( Finance Minister) పయ్యావుల కేశవ్ ( Payyavula Keshav) బాధ్యతలు చేపట్టారు. ఆయన సీనియర్ ఎమ్మెల్యే అయినప్పటికీ, మంత్రిగా ఇదే మొదటిసారి. అయితే, చంద్రబాబు లాంటి అనుభవం ఉన్న నాయకుడు పక్కన ఉండటం వల్ల బడ్జెట్ బాగా ఉండొచ్చని భావిస్తున్నారు. ఈసారి బడ్జెట్ మొత్తం మూడు లక్షల కోట్లకు పైగా ఉంటుందా అనే చర్చ జరుగుతోంది. ఇంత పెద్ద బడ్జెట్ ఉండాలంటే ఆదాయ వనరులు పెరగాలి. కేంద్రం నుంచి సహాయం వస్తుందనే నమ్మకం ఉండాలి.
ఇప్పటికే చంద్రబాబు రాష్ట్రం ఆర్థికంగా బలహీనంగా ఉందని చెప్పారు. చేయాల్సిన పనులు చాలా ఉన్నా, డబ్బుల లేమితో పెద్దగా ఏం చేయలేమని స్పష్టం చేశారు. అయినప్పటికీ, ముఖ్యమైన సంక్షేమ పథకాలను కొనసాగించాల్సిందే. ముఖ్యంగా తల్లికి వందనం (Thalliki Vandanam) , రైతు భరోసా (Rythu Bharosa) పథకాలకు ప్రాధాన్యం ఇచ్చే అవకాశం ఉంది. తల్లికి వందనం పథకంలో లబ్దిదారులు 85 లక్షల మంది తల్లులు. రైతు భరోసా ద్వారా 55 లక్షల మంది రైతులకు సహాయం అందుతుంది. మొత్తం కలిపితే 1.4 కోట్ల మంది ప్రజలు ఈ పథకాల కోసం ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రం ఉన్న పరిస్థితుల్లో ఈ పథకాలు ఎలా కొనసాగుతాయి అన్న విషయం ఆసక్తిగా మారింది. ప్రభుత్వం మాటల కంటే కేటాయించే నిధులకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు ప్రజలు.
రైతు భరోసా పథకాన్ని మూడు విడతలుగా అమలు చేయాలని అనుకుంటున్నారు అని టాక్. అలాగే తల్లికి వందనం నిధులను కూడా విడతల వారీగా ఇస్తారా లేక ఎప్పటిలా ఒకేసారి అందిస్తారా అన్నది ప్రశ్నార్ధకంగా మారింది. అధికారిక లెక్కల ప్రకారం 85 లక్షల మంది తల్లులు లబ్దిదారులుగా ఉన్నప్పటికీ, మార్గదర్శకాలు మారితే ఆ సంఖ్య 65 లక్షల వరకు తగ్గొచ్చని అంటున్నారు. అయినప్పటికీ, లబ్దిదారుల సంఖ్య చాలా పెద్దదే. ఏది ఏమైనా, నిధులు లేవని చెప్పి సంక్షేమ పథకాలను ఆలస్యం చేస్తే ప్రజలు ఒప్పుకోరు. ఇప్పటికే సూపర్ సిక్స్ పథకాల అమలుపై మెల్లిగా ప్రజలలో అసంతృప్తి ప్రారంభమవుతుంది.. ఈ నేపథ్యంలో అమలు చేస్తున్న పథకాలు ఆలస్యం అయితే మరిన్ని సమస్యలు తలెత్తవచ్చు. ఈ బడ్జెట్లో సరైన కేటాయింపులు చేస్తేనే ప్రభుత్వం మాటలను ప్రజలు నమ్ముతారు. కాబట్టి, చంద్రబాబు ప్రభుత్వం ఇచ్చిన హామీలు నిజమవుతాయా? లేదా కేవలం మాటలకే పరిమితమవుతాయా? అనే ఉత్కంఠ అందరిలోనూ ఉంది.













