Chandrababu: కొందరు ఎమ్మెల్యేల తీరుపై సీఎం చంద్రబాబు అసహనం

ఏపీ కేబినెట్ భేటీ తర్వాత రాజకీయ పరిణామాలపై మంత్రులతో సీఎం చంద్రబాబు (CM Chandrababu) చర్చించారు. ఈ సందర్భంగా కొందరు ఎమ్మెల్యేల తీరుపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. క్రమశిక్షణ తప్పిన ఎమ్మెల్యేల విషయంలో బాధ్యత తీసుకోవాలని ఇన్ఛార్జ్ మంత్రులకు సీఎం (CM Chandrababu) సూచించారు. పాలనలో వేగం పెంచాలని, ఫైళ్ల క్లియరెన్స్‌లో జాప్యం జరగకుండా చూడాలని మంత్రులను ఆదేశించారు. తాను ఇప్పటివరకు 3,366 ఫైళ్లను క్లియర్ చేశానని, ఒక్కో ఫైలుకు సగటున 3 రోజులు పట్టిందని చంద్రబాబు తెలిపారు. మంత్రివర్గ సమావేశానికి ముందు, ఎమ్మెల్యేల వివాదాస్పద వ్యవహారాలపై మంత్రి లోకేశ్ (Nara Lokesh) స్పందించారు. దగ్గుబాటి ప్రసాద్, కూన రవి, బుడ్డా రాజశేఖర్, నజీర్ అహ్మద్, కోటంరెడ్డి, సునీల్ వంటి నేతల గురించి చర్చించినట్లు సమాచారం. అనంతపురం, శ్రీశైలం ఎమ్మెల్యేలతో సహా మొత్తం ఏడుగురు ఎమ్మెల్యేల తీరు సరికాదని లోకేశ్ (Nara Lokesh) పేర్కొన్నారు. ప్రభుత్వానికి నష్టం కలిగించేలా వ్యవహరిస్తే సహించేది లేదని ఆయన మంత్రులకు స్పష్టం చేశారు. పెరోల్ వంటి సున్నితమైన విషయాల్లో ఎమ్మెల్యేల సిఫార్సులపై జాగ్రత్తగా వ్యవహరించాలని మంత్రి అనితకు లోకేశ్ సూచించారు. దివ్యాంగుల పింఛన్ల తొలగింపుపై ఫిర్యాదులు వచ్చినప్పుడు, అర్హులు ఎవరూ నష్టపోకుండా చర్యలు తీసుకుంటామని ఆయన (Nara Lokesh) హామీ ఇచ్చారు.