పోలవరానికి రూ.4 వేలకోట్ల రాష్ట్ర ప్రభుత్వ వ్యయం చెల్లించని కేంద్రం: సీఎం
జాతీయ ప్రాజెక్టు అయిన పోలవరానికి ఇంతవరకూ తాము పెట్టిన రూ.4వేల కోట్లు చెల్లించలేదు’ అని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కేంద్ర వైఖరిని దుయ్యబట్టారు. లోటు బడ్జెట్లో భర్తీచేయాల్సిన మొత్తం కూడా ఇంతవరకు సరిగ్గా ఇవ్వలేదన్నారు. పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించి పెరిగిన అంచనా వ్యయాన్ని భరిస్తామని అప్పటి మన్మోహన్ సింగ్ ప్రభుత్వం ఆఖరి మంత్రిమండలి సమావేశంలో ఆమోదించిన విషయాన్ని ముఖ్యమంత్రి ఈ సందర్భంగాప్రతిపక్ష, అఖిల పక్ష ప్రజా సంఘాల ప్రతినిధులకు గుర్తు చేశారు.
ఆరుదశాబ్దాల కష్టాన్ని హైదరాబాద్కు ధారపోశాం
‘ఆరు దశాబ్దాలు హైదరాబాద్ లో ఉన్నాం. రాజధాని లేకుండా ఇక్కడకు వచ్చాం. 58% జనాభాకు 46% ఆదాయం వచ్చేలా విభజించారు. దక్షిణ భారతదేశంలో మిగిలిన రాష్ట్రాలతో సమానంగా మేము అభివృద్ది చెందాలంటే చేయూతనివ్వాలని కేంద్రాన్ని పదేపదే అభ్యర్ధించాం. ఇదే వృద్ధి రేటుతో 15ఏళ్లు కృషి చేస్తేనే పొరుగు రాష్ట్రాలతో సమాన స్థాయికి చేరుతాం. మన ముందున్న అతిపెద్ద సవాల్ అదే’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు.
కడప ఉక్కు కర్మాగారం పెట్టకుండా జాప్యం
‘కడప స్టీల్ ప్లాంట్ పెట్టకుండా 4ఏళ్లుగా జాప్యం చేస్తున్నారు. టాస్క్ ఫోర్స్ సమావేశాల పేరుతో వాయిదాలు. చివరికి మనమే సొంతంగా పెట్టుకోవాల్సిన దుస్థితి నెలకొంది. వనరులు, మన డబ్బులతో అభివృద్ది. అయినా కేంద్రానికి వాటిపై పన్నులు చెల్లిస్తున్నాం’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు అఖిలపక్షాలు, ప్రజాసంఘాల నేతల దృష్టికి తెచ్చారు.
లోక్ సత్తా నివేదిక ప్రామాణికం: పార్టీ ప్రతినిధి ఉప్పలపాటి మాచిరాజు
ప్రమాణికమైన లెక్కలు కట్టి కచ్చితమైన ఆధారాలతో 15మందితో కూడిన బృందం ఒక రిపోర్టును లోక్ సత్తా పార్టీ తయారు చేసిందని లోక్సత్తా పార్టీ ప్రతినిధి ఉప్పలపాటి మాచిరాజు తెలిపారు. విభజన అంశాలపై మాట్లాడే ప్రతి ఒక్కరికి తమ పార్టీ ఇచ్చిన నివేదిక ఒక ప్రామాణికమని ఆయన చెప్పారు. చట్టంలో నిర్దేశించిన వాటిని లెక్కలు గట్టి మా నివేదిక తయారుచేశామన్నారు. ఎన్నికల ముందు పొత్తు పెట్టుకున్నందున టీడీపి మేనిఫెస్టోలోని రైతు రుణమాఫీ విషయంలో కేంద్ర ప్రభుత్వానికి కూడా బాధ్యత ఉందని ఆయన గుర్తు చేశారు. ‘ఏపీకి తీవ్ర అన్యాయం జరిగింది. కేంద్రం కక్ష సాధింపుగా చేస్తుంది అనేదానికి జయప్రకాష్ నివేదిక ప్రామాణిక గ్రంథం’ అని ఆయన వ్యాఖ్యానించారు.













