హైకోర్టు వచ్చినంత మాత్రాన ఇవన్నీ వస్తాయా ?
కర్నూలు జిల్లాకు హైకోర్టు ఒక్కటే ఇచ్చి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేతులు దులుపుకోవడం సరికాదని తెలుగుదేశం పార్టీ నేత, మాజీ మంత్రి భూమా అఖిలప్రియా మండిపడ్డారు. ఈ మేరకు ఆమె ఓ ప్రకటన విడుదల చేశారు. రాయలసీమ ప్రజలు కోరుకునేది నీళ్లు, పరిశ్రమలు, ఉద్యోగాలు.. హైకోర్టు వచ్చినంత మాత్రాన ఇవన్నీ వస్తాయా? అని ఆమె ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. హంద్రీ-నీవా, గాలేరు-నగరి సుజల స్రవంతి ప్రాజెక్టు పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అఖిలప్రియ డిమాండ్ చేశారు. టీడీపీ ప్రభుత్వం 23 ప్రాజెక్టుల నిర్మాణం 5 ఏళ్లలోనే పూర్తి చేసిందని చెప్పారు. దానికన్న మిన్నగా వైకాపా ప్రభుత్వం 46 ప్రాజెక్టుల నిర్మాణ పనులను పూర్తి చేయాలని సవాల్ విసిరారు. టీడీపీ హయాంలో కర్నూలు, అనంతపురం, కడప జిల్లాల్లో రూ.44 వేల కోట్ల పెట్టుబడులతో సోలార్ విండ్ పవర్ ప్లాంట్లు తెచ్చామని గుర్తు చేశారు. ప్రస్తుత ప్రభుత్వం అంతకు రెట్టింపు పెట్టుబడులను సీమ జిల్లాలకు తీసుకురావాలని కోరారు. అభివృద్ధిలో టీడీపీ ప్రభుత్వంతో పోటీపడి ప్రజల్లో మెప్పు పొందాలి గానీ ప్రజలను మభ్యపెట్టే చర్యలకు పాల్పడ కూడదని ఆమె హితవు పలికారు.













