ఎగ్జిట్ పోల్స్ ను వైసీపీ తనకు అనుకూలంగా మార్చుకోబోతోందా..?

దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు జరిగినా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఫలితాలపైనే అందరి చూపు ఉంది. జగన్ రెండోసారి అధికారంలోకి వస్తారా.. లేదంటే టీడీపీ పగ్గాలు చేపడుతుందా అనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అయితే చాలాకాలంగా కూటమికి అనుకూలంగా మెజారిటీ సర్వేలు తమ అంచనాలను వెల్లడించాయి. కోడ్ అమల్లోకి వచ్చాక సర్వే సంస్థలకు నోరు కట్టేసినట్లు అయింది. అయితే జూన్ 1న తుది విడత పోలింగ్ ముగియనుండడంతో ఆరోజు సాయంత్రం ఎగ్జిట్ పోల్స్ వెల్లడించేందుకు ఈసీ అనుమతించింది. దీంతో ఇప్పుడు అందరి దృష్టి ఎగ్టిట్ పోల్స్ పైనే ఉంది.
2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ 151 అసెంబ్లీ స్థానాలను కైవసం చేసుకుంది. ఈ ఐదేళ్లలో తాము సంక్షేమానికి కొత్త అర్థం చెప్పామని దాదారు రెండున్నర లక్షల కోట్ల రూపాయలను ప్రజల అకౌంట్లలో నేరుగా వేశామని ఆ పార్టీ నేతలు చెప్తున్నారు. అందుకే తామే ఈసారి కూడా అధికారంలోకి రాబోతున్నామని ధీమాగా చెప్తున్నారు. అయితే సర్వే సంస్థల తీరు మాత్రం వేరేలా ఉంది. వైసీపీపై వ్యతిరేకత తీవ్రంగా ఉందని ఆ పార్టీకి ఈసారి అధికారం దక్కడం కష్టమేనని చెప్తున్నాయి. గతంలో వైసీపీని అధికారంలోకి తెచ్చిన ప్రశాంత్ కిశోర్ కూడా ఈసారి జగన్ ఘోరంగా ఓడిపోబోతున్నట్టు వెల్లడించారు.
టీడీపీ, జనసేన.. బీజేపీతో కలిసి ఎన్నికలకు వెళ్లడం.. కూటమికే విజయావకాశాలు ఉన్నాయని సర్వేలు చెప్తుండడంతో వైసీపీ డీలా పడింది. పోలింగ్ రోజు పరిణామాలు కూడా వైసీపీకి ఏమాత్రం కలిసి రాలేదు. ఆ తర్వాత కూడా ఎన్నికల సంఘం, పోలీసులపైన వైసీపీ నేతలు విమర్శలు గుప్పిస్తూ వస్తున్నారు. అధికారంలో ఉన్న పార్టీయే ఇలా వ్యవస్థ సహకరించలేదని ఫిర్యాదులు చేస్తుండడంతో వైసీపీ శ్రేణులు మరింత డీలా పడ్డాయి. ఓటమి భయంతోనే ఆ పార్టీ నేతలు ఇలా మాట్లాడుతున్నారని విపక్ష నేతలు ఎద్దేవా చేస్తున్నారు.
అయితే ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ కు సమయం దగ్గర పడుతుండడంతో వైసీపీ అప్రమత్తమైనట్టు సమాచారం. వైసీపీ గెలుస్తుందని ఆ పార్టీ సానుభూతిపరులు ఎంతోమంది బెట్టింగులు కాశారు. ఇలాంటప్పుడు ఎగ్జిట్ పోల్స్ లోనే వైసీపీ ఓడిపోతుందని తెలిస్తే తమకు తీవ్ర నష్టం ఖాయమని వాళ్లంతా భయపడుతున్నట్టు సమాచారం. కనీసం ఫలితాలు వెల్లడయ్యేంత వరకూ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపేందుకు వైసీపై అధినాయకత్వం ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. అందుకే కీలకమైన కొన్ని సర్వే సంస్థలను తమవైపు తిప్పుకుని ఎగ్జిట్ పోల్స్ లో తమకు అనుకూలంగా ఫలితాలు ఉండేలా చూసుకుంటున్నట్టు తెలుస్తోంది. ఎగ్జిట్ పోల్స్ ను మేనేజ్ చేయొచ్చు కానీ ఒరిజినల్ రిజల్ట్ ను ఎలా మేనేజ్ చేయగలరని ఇప్పుడు సోషల్ మీడియాలో వైసీపీపై సెటైర్లు వినిపిస్తున్నాయి.











































































