Vijaya Sai Reddy: రాజ్యసభ కాదు.. అంతకుమించి..!! కీలక పోస్టుతో విజయసాయి పొలిటకల్ రీఎంట్రీ..!?
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో (AP Politics) విజయసాయి రెడ్డి (Vijayasai Reddy) సంచలనంగా మారారు. జనవరిలో రాజ్యసభ (Rajya Sabha) సభ్యత్వానికి, వైసీపీకి (YSRCP) రాజీనామా చేసి రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ఆయన ప్రకటించారు. వ్యవసాయం చేసుకుంటానన్నారు. అయితే.. ఇప్పుడు మళ్లీ రాజకీయాల్లో యాక్టివ్ కావడానికి విజయసాయి రెడ్డి (Vijayasai Reddy reentry) సిద్ధమవుతున్నారనే వార్తలు వెలుగులోకి వచ్చాయి. బీజేపీలో (BJP) చేరేందుకు ఆయన లైన్ క్లియర్ చేసుకుంటున్నారని, ఇప్పటికే బీజేపీ అగ్రనేతలతో మంతనాలు జరిపారని తెలుస్తోంది.
విజయసాయిరెడ్డి రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించి 3 నెలలవుతోంది. ఇంతలోనే.. ఆయన మళ్లీ పొలిటకల్ రీ-ఎంట్రీకి సన్నాహాలు చేస్తున్నారనే ప్రచారం ఊపందుకుంది. బీజేపీలో చేరేందుకు ఆయన రంగం సిద్ధం చేసుకున్నారని, ఇందుకు బీజేపీ హైకమాండ్ కూడా అంగీకరించిందనే ఊహాగానాలు మొదలయ్యాయి. ఓ ప్రముఖ టీవీ చానల్ ఈ విషయాన్ని ధృవీకరించింది. త్వరలో విజయసాయి రెడ్డి రాజనామా చేయడం ద్వారా ఖాళీ అయిన రాజ్యసభ స్థానానికి ఉపఎన్నిక జరగనుంది. ఆ స్థానం నుంచి విజయసాయి రెడ్డే బీజేపీ తరపున పోటీ చేస్తారని అందరూ అనుకున్నారు. అయితే తాను రాజ్యసభ రేసులో లేనని విజయసాయి రెడ్డి రెండ్రోజుల కిందట కూడా ప్రకటించారు.
దీంతో విజయసాయి రెడ్డి రాజ్యసభను మించి అధిక ప్రాధాన్యత ఉన్న ఒక కీలక పదవిపై దృష్టి సారించినట్లు సమాచారం. బీజేపీలో చేరిన తర్వాత రాష్ట్ర స్థాయిలో కాకుండా జాతీయ స్థాయి రాజకీయాల్లో యాక్టివ్గా ఉండాలని విజయసాయిరెడ్డి భావిస్తున్నట్లు ఆయన సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. అయితే, విజయసాయిరెడ్డి బీజేపీలో చేరికకు కొన్ని అడ్డంకులు కూడా ఉన్నాయి. రాష్ట్రంలో టీడీపీ, జనసేనతో కలిసి బీజేపీ పనిచేస్తోంది. వైసీపీ హయాంలో విజయసాయి రెడ్డి కూడా అక్రమాలకు పాల్పడ్డారని, ఇప్పుడాయన్ను పార్టీలో చేర్చుకుంటే ఇబ్బందులు తలెత్తుతాయని టీడీపీ (TDP), జనసేన (Janasena) నేతలు అభ్యంతరం తెలుపుతున్నట్టు వార్తలందుతున్నాయి. అయితే జగన్ ను ఇరికించేందుకు విజయసాయి రెడ్డిని అస్త్రంగా వాడుకునే అవకాశం లభిస్తుందని బీజేపీ నచ్చజెప్తున్నట్టు సమాచారం. ఒకవేళ అదే నిజమైతే విజయసాయి రెడ్డి బీజేపీలో చేరికకు టీడీపీ, జనసేన నుంచి అభ్యంతరం ఉండకపోవచ్చు.
గతంలో వైసీపీలో విజయసాయిరెడ్డి కీలక పాత్ర పోషించారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి సన్నిహితుడిగా, ఢిల్లీలో పార్టీ వ్యవహారాలను నిర్వహించడంలో ఆయన చాణక్యుడిగా పేరు తెచ్చుకున్నారు. బీజేపీ అగ్రనేతలైన ప్రధాని నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్ షాతో ఆయనకు ఉన్న సత్సంబంధాలు వైసీపీకి కలిసొచ్చాయి. అయితే 2024 ఎన్నికల్లో వైసీపీ ఓటమి తర్వాత ఆయన పార్టీలో ప్రాధాన్యత తగ్గడం, ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కేసుల ఒత్తిడి వంటి కారణాలతో రాజీనామా చేసినట్లు ఊహాగానాలు వచ్చాయి. ఇప్పుడు బీజేపీలో చేరేందుకు సిద్ధమవడం ఆయన రాజకీయంగా పునర్జన్మ పొందే ప్రయత్నంగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.













