తెలుగు రాష్ట్రాల సీఎంలకు తలనొప్పులు..!
అభివృద్ధిలో పోటీ పడాల్సిన తెలుగు రాష్ట్రాలు ఇప్పుడు సరికొత్త సమస్యలకు వేదికలవుతున్నాయి. తెలుగు రాష్ట్రాల సీఎంలిద్దరికీ కేసులు పెద్ద సవాల్ గా మారాయి. అటు జగన్, ఇటు కేసీఆర్.. ఇద్దరూ కేసుల ఊబి నుంచి బయటపడేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. తమపై ఈ కేసులు లేకున్నా.. తమ కుటుంబీకులకు సంబంధించిన వ్యవహారం కావడం, రాష్ట్రాల పరువు ప్రతిష్టలకు సంబంధించినవి కావడం వారికి పెద్ద తనలొప్పిగా మారింది.
వై.ఎస్.వివేకానంద రెడ్డి హత్య కేసులో సీబీఐ స్పీడ్ పెంచింది. ఇన్నాళ్లు ఏపీ కేంద్రంగా సీబీఐ విచారణ జరిగేది. అయితే అక్కడ అధికారుల నుంచి తమకు తగిన సహకారం లభించట్లేదని సీబీఐ అధాకారులు కోర్టు దృష్టికి తీసుకెళ్లడంతో కేసు తెలంగాణకు బదిలీ అయింది. అప్పటి నుంచి సీబీఐ జోరుమీదుంది. కడప ఎంపీ అవినాశ రెడ్డిని ఇప్పటికే 3 దఫాలు విచారించింది సీబీఐ. రేపోమాపో అవినాశ్ రెడ్డితో పాటు ఆయన తండ్రి భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేయడం ఖాయమని ఏపీలో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇదే జరిగితే జగన్ కు పెద్ద దెబ్బ.
మరోవైపు తెలంగాణ సీఎం కేసీఆర్ కుమార్తె కవిత ఢిల్లీ లిక్కర్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే సీబీఐ, ఈడీ ఎదుట కవిత హాజరయ్యారు. శనివారం ఈడీ ముందు హాజరైన కవితను అరెస్టు చేస్తారని చివరి నిమిషం వరకూ భావించారు. అయితే మరోసారి 16న విచారణకు రావాలంటూ ఈడీ కవితను ఆదేశించింది. దీంతో బీఆర్ఎస్ శ్రేణులు ఊపిరి పీల్చుకున్నాయి. అయితే ఇప్పుడు కాకపోతే రేపైనా అరెస్టు ఖాయమని అందరూ భావిస్తున్నారు. అదే జరిగితే కేసీఆర్ స్పీడ్ కు బ్రేకులు పడ్డట్లే.
ఏపీ సీఎం జగన్, తెలంగాణ సీఎం కేసీఆర్ ఇద్దరూ ఒకేసారి రెండు పెద్ద అంశాలను డీల్ చేయాల్సి వస్తోంది. వివేకా కేసులో అవినాశ్ రెడ్డిని సీబీఐ అరెస్టు చేస్తే జగన్ సమాధానం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే అవినాశ్ రెడ్డి పార్టీ ఎంపీనే కాక.. జగన్ కుటుంబసభ్యుడు కూడా.! మరోవైపు తెలంగాణ సీఎం కేసీఆర్ బీజేపీపై యుద్ధం సాగిస్తున్నారు. ఇలాంటి సమయంలో సొంత కుమార్తె కవిత కేసులో అరెస్ట్ అయితే అది కచ్చితంగా ఎదురు దెబ్బే. దీన్ని కూడా కేసీఆర్ సమర్థంగా ఎదుర్కోవాల్సి ఉంటుంది. మరి ఇద్దరు సీఎంలూ ఎలా డీల్ చేస్తారో వేచి చూడాలి.













