పార్టీ మార్పుపై సుచరిత సంచలన వ్యాఖ్యలు
అధికార వైసీపీలో అసృంతృప్తులు ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నారు. ఒక్కొక్కరు గీత దాటి నోరు విప్పుతున్నారు. ఇటీవలికాలంలో పలువురు నేతలు వైసీపీ అధిష్టానానికి, ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా గళం విప్పారు. ఈ పరంపర ఇంకా కొనసాగుతోంది. అయితే ఒక్కొక్కరిదీ ఒక్కో రీజన్. ఒక్కొక్కరు ఒక్కో అంశంపై మాట్లాడుతున్నారు. ఇప్పటికే ఎమ్మెల్యేలు ఆనం రామనారాయణ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, వసంత కృష్ణప్రసాద్ తదితరులు పలు అంశాలపై ప్రభుత్వ విధానాలను తప్పుబట్టారు. వీరిలో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని మాత్రమే జగన్ పిలిచి మాట్లాడారు. ఆనం రామనారాయణ రెడ్డి స్థానంలో ఏకంగా నేదురుమిల్లిని నియోజకవర్గ ఇన్ ఛార్జ్ గా నియమించారు. దీంతో వచ్చే ఎన్నికల్లో ఆనం రామనారాయణ రెడ్డికి టికెట్ లేదని క్లారిటీ ఇచ్చేశారు. ఇప్పుడు వైసీపీలో మరో కీలక నేత నోరు విప్పారు.
మేకతోటి సుచరిత.. వైఎస్ జగన్ ను అత్యంత సన్నిహితురాలిగా పేరొందారు. దివంగత నేత వై.ఎస్.రాజశేఖర రెడ్డి హయాం నుంచి ఆమె వారితో ప్రయాణం చేస్తున్నారు. వై.ఎస్.కుటుంబాన్ని ఎంతో అభిమానించే నేత. ఆ అభిమానం చూసే జగన్ తన తొలి కేబినెట్లోనే స్థానం కల్పించారు. పైగా హోంశాఖను కట్టబెట్టారు. దీన్ని బట్టి సుచరితకు జగన్ ఎంత ప్రాధాన్యత ఇస్తారో అందరికీ అర్థమైంది. సుచరిత కూడా జగన్ మాట దాటి ఎప్పుడూ వెళ్లేవారు కాదు. తనకు నియోజకవర్గంలో చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా వాటిని పట్టించుకోకుండా ముందుకు సాగారు. అయితే జగన్ మంత్రివర్గ విస్తరణ సమయంలో సుచరితను పక్కన పెట్టారు. ఇది సుచరితకు తీవ్ర ఆగ్రహం తెప్పించింది. ఆమె అలకపూనారు. బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేశారు. దీంతో సుచరితను జగన్ పిలిపించి మాట్లాడారు. దీంతో ఆ మ్యాటర్ అప్పట్లో సద్దుమణిగింది.
అయితే అప్పటి నుంచి సుచరిత కాస్త అసంతృప్తితోనే ఉన్నట్టు ఆమె అనుచరులు చెప్తూ వస్తున్నారు. ఆమె పార్టీ కార్యక్రమాల్లో కూడా పెద్దగా ఇన్వాల్వ్ అవ్వట్లేదు. పైగా గుంటూరు జిల్లా అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పుకుంటూ అధినేత జగన్ కు లేఖ పంపారు. కేవలం ప్రత్తిపాడు నియోజకవర్గానికి మాత్రమే పరిమితం అవుతానని స్పష్టం చేశారు. దీన్నిబట్టి ఆమె పార్టీ అధిష్టానం పట్ల సానుకూలంగా లేరని మరోసారి అర్థమైంది. ఇప్పుడు సుచరిత మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు.
రాజకీయాల్లో మునుగడ ఉన్నన్నినాళ్లూ వైసీపీతోనే ఉంటామన్నారు సుచరిత. అయితే తన భర్త దయాసాగర్ మరో పార్టీలో చేరి.. తనను కూడా పార్టీ మారాలని కోరితే మారక తప్పదు కదా.. అన్నారు సుచరిత. భర్త ఒక పార్టీలో, తాను మరో పార్టీలో, పిల్లలు మరో పార్టీలో ఉండడం సరికాదన్నారు. ఒక భార్యగా భర్త అడుగుజాడల్లో నడుస్తాను కదా.. అన్నారు సుచరిత. గుంటూరు జిల్లా కాకుమానులో జరిగిన కార్యక్రమంలో సుచరిత చేసిన కామెంట్స్ ఇప్పుడు పార్టీలో కలకలం రేపుతున్నాయి. పార్టీపైన ఆమె ఎలాంటి వ్యతిరేక వ్యాఖ్యలు చేయకపోయినా… భర్త అడుగుజాడల్లో నడుస్తానని.. తాను పార్టీ మారితే నేను కూడా మారతానని సుచరిత చెప్పడం సంచలనం కలిగిస్తోంది. కొంతకాలంగా అసంతృప్తితో ఉన్న సుచరిత కుటుంబం.. పార్టీ మారుతుందేమోననే ఊహాగానాలు కొంతకాలంగా వినిపిస్తున్నాయి. పైగా నియోజకవర్గంలో అంతర్గత పోరు కూడా నడుస్తోంది. మరి ఎన్నికల ముందు సుచరిత కీలక నిర్ణయం ఏమైనా తీసుకుంటారేమో చూడాలి.













