రఘురామకృష్ణంరాజు మళ్లీ బరిలో ఉంటారా..!?
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రఘురామ కృష్ణంరాజుకు ఒక ప్రత్యేకతను సంతరించుకున్నారు. అధికార పార్టీలోనే ఉంటూ ఆ పార్టీకే పెద్ద తలనొప్పిగా మారారు. పక్కలో బల్లెంలా రోజూ అధికార వైసీపీపై విమర్శలు గుప్పిస్తూ ఆ పార్టీకి పెద్ద సమస్యగా మారారు. అయితే ఈ ఐదేళ్లు ఎలాగోలా గడిచిపోయింది. మరి వచ్చే ఎన్నికల్లో ఆయన మళ్లీ బరిలోకి దిగుతారా.. ఒకవేళ పోటీ చేస్తే ఏ పార్టీ తరపున పోటీ చేస్తారు.. అనే ప్రశ్నలు ఇప్పుడు ఆసక్తి కలిగిస్తున్నాయి. ఈ ప్రశ్నలకు రఘురామ కృష్ణంరాజు క్లారిటీ ఇచ్చారు. వైసీపీని గద్దె దించడమే తన లక్ష్యమని .. అందుకోసం ఏమైనా చేస్తానని స్పష్టం చేస్తారు.
కనుమూరు రఘురామ కృష్ణంరాజు రాజకీయ ప్రస్థానం గురించి అందరికీ తెలిసిన విషయమే. వై.ఎస్. రాజశేఖర్ రెడ్డితో మంచి అనుబంధం ఉండడంతో ఆయన మరణానంతరం.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. అయితే 2014 ఎన్నికల్లో రఘురామ కృష్ణంరాజుకు టికెట్ దక్కలేదు. దీంతో ఆ పార్టీని వదిలేసి బీజేపీలో చేరారు. ఆ తర్వాత 2018లో కమలం పార్టీని వదిలేసి టీడీపీలో చేరారు. అయితే అక్కడ కూడా చాన్నాళ్లు ఉండలేదు. 2019 ఎన్నికలకు ముందు మళ్లీ వైసీపీ గూటికి చేరారు.
నర్సాపురం టికెట్ దక్కించుకుని ఘన విజయం సాధించారు. ఇక్కడి వరకూ బాగానే ఉంది. అయితే అక్కడే అసలు కథ మొదలైంది. నర్సాపురం నుంచి రఘురామ కృష్ణంరాజు గెలిచారు. పార్టీ కూడా అధికారంలోకి వచ్చింది. దీంతో ఆయనకు మంచి ఫ్యూచర్ ఉంటుందనుకున్నారు. అయితే ఏం జరిగిందో ఏమో.. ఆయన అధికార పార్టీలోనే ఉంటూ ఆ పార్టీపైనే విమర్శలు గుప్పించడం మొదలు పెట్టారు. ఆ పార్టీకి వ్యతిరేకంగా పని చేయటం స్టార్ట్ చేశారు. బీజేపీకి దగ్గరయ్యారు. ఇప్పుడు టీడీపీతో సన్నిహితంగా ఉంటున్నారు. రఘురామ కృష్ణంరాజుపై వైసీపీ వేటు వేయకుండా అలాగే సహిస్తూ వస్తోంది. లోక్ సభ సెక్రటేరియేట్ లో ఫిర్యాదు చేసి వదిలేసింది. బీజేపీ అండగా ఉండడంతో రఘురామ కృష్ణంరాజుపై ఎలాంటి చర్యలు లేవు. అయితే ఇప్పుడు మళ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. మరి ఇప్పుడు రఘురామ కృష్ణంరాజు మళ్లీ పోటీ చేస్తారా.. లేదా అనే ఉత్కంఠ మొదలైంది.
అయితే దీనిపై ఓ మీడియా చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చారు. తాను వచ్చేసారి కూడా నర్సాపురం నుంచే బరిలోకి దిగబోతున్నట్టు స్పష్టం చేశారు. అయితే తన తరపున కుమారుడు భరత్ నియోజకవర్గంలో పర్యటించి ప్రచారం చేస్తారని చెప్పారు. వైసీపీకి వ్యతిరేకంగా గళం విప్పినప్పటి నుంచి రఘురామ కృష్ణంరాజు నియోజకవర్గంలో అడుగు పెట్టలేదు. కుమారుడు భరతే అక్కడ అన్నిపనులూ చూసుకుంటున్నారు. వచ్చే ఎన్నికల్లో కూడా ఇలాగే భరత్ నియోజకవర్గ బాధ్యతలు చేపట్టనున్నారు. అయితే రఘురామ కృష్ణంరాజు మాత్రం రాష్ట్రమంతా తిరిగి వైసీపీకి వ్యతిరేకంగా ప్రచారం చేస్తారట. ఇంతకూ ఆయన ఏ పార్టీ తరపున బరిలోకి దిగుతారో చెప్పలేదు కదా.. వైసీపీకి వ్యతిరేకంగా ఏర్పాటయ్యే ప్రతిపక్ష కూటమి నుంచి బరిలో ఉంటారట. మరి ఆ ప్రతిపక్ష కూటమిలో బీజేపీ ఉంటుందా.. ఉండదా.. అనేది మరో ప్రశ్న.













