పవన్ కల్యాణ్ పోటీ చేయబోయే సీట్ ఇదేనా..? ఈసారి అసెంబ్లీలో అడుగు పెట్టడం ఖాయమా..?
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఈసారి ఎలాగైనా గెలిచి అసెంబ్లీలో అడుగు పెట్టాలని భావిస్తున్నారు. గత ఎన్నికల్లో రెండు స్థానాల నుంచి పోటీ చేసినా కూడా పవన్ కల్యాణ్ కు నిరాశే ఎదురైంది. భీమవరం, గాజువాక అసెంబ్లీ స్థానాల నుంచి పవన్ బరిలోకి దిగారు. అయితే రెండు చోట్లా ఓడిపోయారు. పార్టీ అధినేతే ఓడిపోవడంతో జనసేన శ్రేణులు తీవ్ర నిరాశ చెందాయి. ఈసారి అలాంటి అవకాశమే ఇవ్వకూడదనుకుంటున్నారు పవన్ కల్యాణ్. ఎలాగైనా గెలిచి అసెంబ్లీలో అడుగు పెట్టి సత్తా చాటాలనుకుంటున్నారు.
ఈసారి వైసీపీని గద్దె దించి అధికారంలోకి రాబోతున్నట్టు పవన్ కల్యాణ్ ఇప్పటికే ప్రకటించారు. అందుకోసం ఎవరితోనైనా కలిసి పని చేసేందుకు సిద్ధమని వెల్లడించారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీతో కలిసి జనసేన పోటీ చేసే అవకాశం ఉందనే వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. మరి ఈ రెండు పార్టీలతో బీజేపీ కలుస్తుందా.. కలవదా.. అనేదానిపై స్పష్టత రావాల్సి ఉంది. ఇప్పటికైతే పవన్ కల్యాణ్ బీజేపీతో కలిసి ఉన్నారు. అయితే త్వరలోనే టీడీపీతో కూడా కలుస్తారనే ప్రచారం జోరందుకుంది. అదే జరిగితే జనసేనకు ఎన్ని సీట్లు దక్కుతాయి.. పవన్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారనేది ఆసక్తి కలిగిస్తోంది.
అసెంబ్లీలో అడుగు పెట్టాలంటే ఏ సీటు నుంచి పోటీ చేస్తే బాగుంటుందనే అంశంపై పవన్ కల్యాణ్ ఇప్పటికే పార్టీ శ్రేణులతో చర్చిస్తున్నట్టు తెలుస్తోంది. గతంలో పోటీ చేసిన గాజువాక, భీమవరం అసెంబ్లీ స్థానాల నుంచి పవన్ కల్యాణ్ పోటీ చేసే అవకాశం కనిపించడం లేదు. ఒకసారి ఓడించిన ప్రజల దగ్గరకు మళ్ళీ వెళ్లి ఓట్లడిగే ఉద్దేశం పవన్ కు లేదని తెలుస్తోంది. దీంతో కొత్త స్థానాలపై కన్నేసారు జనసేనాని. పవన్ దృష్టిలో రెండు స్థానాలు ప్రధానంగా ఉన్నట్టు తెలుస్తోంది.
తిరుపతి, పిఠాపురం.. అసెంబ్లీ స్థానాలపై పవన్ కల్యాణ్ ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది. తిరుపతి నుంచి గతంలో పవన్ అన్న చిరంజీవి ప్రజారాజ్యం తరపున పోటీ చేసి గెలుపొందారు. అప్పుడు సొంత నియోజకవర్గం పాలకొల్లు నుంచి పోటీ చేసి ఓడిపోయారు చిరంజీవి. సొంతూరులో చిరంజీవిని ఓడించినా.. గెలిపించి అసెంబ్లీకి పంపిన చరిత్ర తిరుపతి ప్రజలకుంది. ఇప్పుడు పవన్ కల్యాణ్ కూడా అన్న బాటలోనే పయనించే అవకాశం కనిపిస్తోంది. తిరుపతిలో సామాజిక వర్గం అండ పుష్కలంగా లభిస్తుంది. టీడీపీతో కలిసి వెళ్తో ఆ పార్టీ ఓటుబ్యాంకు కూడా కలిసొస్తుంది. అప్పుడు సునాయాసమనే ధీమా జనసేన శ్రేణుల్లో వ్యక్తమవుతోంది.
ఇక పవన్ కల్యాణ్ దృష్టిలో ఉన్న మరో నియోజకవర్గం పిఠాపురం. జనసేనకు మంచి పట్టున్న నియోజకవర్గాలలో ఇది ఒకటి. కాపు సామాజికవర్గం ఇక్కడ కీలక ఫ్యాక్టర్. లోకల్ లీడర్స్ కూడా జనసేనను ఇక్కడి నుంచి పోటీ చేయాలని ఎప్పటి నుంచో కోరుతున్నారు. ఎలాగైనా గెలిపిస్తామనే హామీ ఇస్తున్నారు. ఉభయగోదావరి జిల్లాల్లో కాపు సామాజిక వర్గం ఎక్కువ. కాబట్టి ఇక్కడి నుంచి పోటీ చేస్తే రెండు జిల్లాల్లో ప్రభావం చూపించవచ్చనే ఆలోచన ఉంది. గత ఎన్నికల్లో ఒంటరిగా వెళ్లినందున దెబ్బి తన్నాం కానీ.. ఈసారి టీడీపీతో కలిసి వెళ్తే 20కి పైగా స్థానాల్లో జనసేన గెలుస్తుందనే నమ్మకం ఆ పార్టీ శ్రేణుల్లో వ్యక్తమవుతోంది. మరి పవన్ కల్యాణ్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారో వేచి చూడాలి.













