లోకేశ్‌కు పోటీగా బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి..!
ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ హాట్ హాట్ గా మారుతున్నాయి. ముఖ్యంగా అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఒకరు ఒకటంటే మరొకరు రెండనేందుకు ఏమాత్రం వెనుకాడట్లేదు. ఎన్నికలకు ఇంకో ఏడాది మాత్రమే సమయం ఉంది. దీంతో అన్ని పార్టీలూ ప్రజల వద్దకు వెళ్లేందుకు ఎక్కువగా ప్రాధాన్యం ఇస్తున్నాయి. ఇప్పటికే టీడీపీ యువనేత నారా లోకేశ్ పాదయాత్ర మొదలు పెట్టేశారు. మరోవైపు అధికార పార్టీ వివిధ రూపాల్లో కార్యక్రమాలు చేపడుతోంది. అందులో భాగంగా వైఎస్ఆర్సీపీ యువజన విభాగం కూడా రాష్ట్రవ్యాప్తంగా వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తోంది.
గుడివాడలో వైసీపీ యువజన విభాగం ఆధ్వర్యంలో జరిగిన సభ కోలాహలంగా సాగింది. యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు బైరెడ్డి సిద్ధార్ధ్ రెడ్డితో పాటు స్థానిక ఎమ్మెల్యే కొడాలి నాని ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొడాలి నాని చేసిన కామెంట్స్ హాట్ హాట్ గా మారాయి. నారా లోకేశ్ విసిరిన సవాళ్లను ఎదుర్కోవడానికి సీఎం జగన్మోహన్ రెడ్డి అవసరం లేదని.. బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి చాలని ఎద్దేవా చేశారు. యువగళం అని యాత్ర చేయాల్సింది నారా లోకేశ్ కాదని.. బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి అని చెప్పారు. లోకేశ్ యాత్రకు వచ్చే వాళ్లంతా పెయిడ్ ఆర్టిస్టులన్నారు. అదే బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి రాష్ట్రంలో ఎక్కడికి వెళ్లినా లోకేశ్ యాత్రకు వచ్చిన వాళ్లకంటే పదింతలు జనం వస్తారని.. అలా రాకపోతే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని కొడాలి నాని సవాల్ విసిరారు.
టీడీపీపై విమర్శలు చేయడానికి కొడాలి నాని ఎప్పుడూ రెడీగా ఉంటారు. పైగా ఇప్పుడు పక్కన సిద్ధార్థ్ రెడ్డి లాంటి మాస్ లీడర్ ఉన్నారు. అదీ సొంతగడ్డ గుడివాడిలో సమావేశం జరుగుతోంది. దీంతో వైసీపీ శ్రేణుల ఆనందానికి హద్దే లేకుండా పోయింది. పైగా లోకేశ్ పైన నాని మాట్లాడితే వైసీపీ శ్రేణులకు ఎక్కడలేని పూనకం వచ్చేస్తుంది. ఇప్పుడు కూడా అదే జరిగింది. ఎప్పటిలాగే లోకేశ్, చంద్రబాబుపై నాని ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు. లోకేశ్ పప్పు కూడా కాదని.. పొట్టు అని ఎద్దేవా చేశారు. ఎందుకూ పనికిరాడన్నారు. అలాంటి వాడు జగన్ కు సవాల్ చేసే అర్హత లేదన్నారు.
వైసీపీలో బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి మాస్ లీడర్ గా పేరొందారు. ఆయన క్రేజ్ మామూలుగా ఉండదు. ఎక్కడికెళ్లినా యూత్ ఎగబడుతుంటారు. అలాంటి సిద్ధార్థ్ రెడ్డిని లోకేశ్ పైకి దించడం ద్వారా సరికొత్త ఈక్వేషన్ ను తెరపైకి తెచ్చారు కొడాలి నాని.













