వారెవ్వా కేసీఆర్…! విశాఖ ఉక్కుపై అదిరిన స్ట్రాటజీ..!!
ఏపీలో బీఆర్ఎస్ విస్తరణకు కేసీఆర్ వ్యూహరచన చేస్తున్నారు. కొంతకాలంగా బీఆర్ఎస్ విశాఖ ఉక్కు ఫ్యాక్టరీనీ ప్రాధాన్యతాంశంగా పెట్టుకుంది. విశాఖ ఉక్కును ప్రైవేటీకరించొద్దని, దాన్ని అడ్డుకుంటామని ఆ మధ్య కేటీఆర్ స్పష్టం చేశారు. ఇప్పుడు ఏకంగా విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ బిడ్ లో తెలంగాణ ప్రభుత్వం తరపున పాల్గొనాలని నిర్ణయించినట్టు సమాచారం. సింగరేణికి బొగ్గు గనులున్నాయి. దీనికి స్టీల్ ప్లాంట్ తోడైతే తిరుగుండదు.
విశాఖ ఉక్కును ముందు పెట్టుకుని ఆంధ్రప్రదేశ్ లో అడుగు పెట్టాలనేది కేసీఆర్ వ్యూహంగా కనిపిస్తోంది. విశాఖ ఉక్కును తెరపైకి తీసుకురావడం ద్వారా కేసీఆర్ ఆశిస్తున్న మొదటి ప్రయోజనం బీజేపీని దెబ్బతీయడం. బీజేపీ ప్రైవేటీకరిస్తుంటే తాము అడ్డుకుంటున్నామనే విశ్వాసాన్ని అటు ఏపీ ప్రజల్లో, ఇటు తెలంగాణలో కల్పించవచ్చు. ఇది ఎన్నికల్లో ఎంతో ఉపయోగపడుతుంది. ఇప్పటికే పలు ప్రభుత్వ రంగ సంస్థలను బీజేపీ ప్రైవేటీకరిస్తోందని, గత ప్రభుత్వాలు వీటిని ఏర్పాటు చేస్తే మోదీ ప్రభుత్వం అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తోందని కేసీఆర్ ధ్వజమెత్తుతున్నారు. విశాఖ ఉక్కు – ఆంధ్రుల హక్కు అని నాడు ఎంతోమంది పోరాడి సాధించుకున్నారని, అలాంటి దాన్ని ప్రైవేటీకరిస్తే ఊరుకోబోమని, దాన్ని కాపాడుకుంటామని కేసీఆర్ చెప్తున్నారు. ఇదే జరిగితే బీజేపీకి పెద్ద దెబ్బ.
ఇక రెండోది.. విశాఖ ఉక్కును తెలంగాణ ప్రభుత్వం దక్కించుకుంటే ఇక్కడ ఆ పార్టీకి తిరుగుండదు. సింగరేణిలో బొగ్గును విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని అనుసంధానించి పారిశ్రామిక రంగంలో పెద్ద విప్లవాన్నే సృష్టించవచ్చు. ఇది తెలంగాణలో బీజేపీకి మైనస్ అయితే బీఆర్ఎస్ కు ఎంతో లబ్ది చేకూరుస్తుంది. అలాగే బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీని కేంద్రం అడ్డుకుంటోందని.. ఇప్పుడు విశాఖ ఉక్కును తామే సొంతంగా దక్కించుకున్నామని చెప్పుకునేందుకు అర్హత లభిస్తుంది. దీని ద్వారా బీజేపీని మరింత ఇరుకున పెట్టొచ్చు.
రాష్ట్ర విభజనకు కారణమైన కేసీఆర్ పై ఏపీలో ఎంతో వ్యతిరేకత ఉంది. ఆ వ్యతిరేకతను పొగొట్టుకుని ఏపీలో పాగా వేయడం అంత ఆషామాషీ కాదు. కానీ విశాఖ ఉక్కుకోసం ఉద్యమించి.. దాన్ని తెలంగాణ ప్రభుత్వం తరపున దక్కించుకోగలగితి ఏపీ పార్టీలు చేయలేని పనిని తాను చేసి చూపించానని చెప్పుకునేందుకు కేసీఆర్ కు వాయిస్ దొరుకుతుంది. అలాగే వైసీపీ, టీడీపీలపై ఎదురుదాడి చేసేందుకు వీలవుతుంది. ఉమ్మడిగా ఉన్నప్పుడు ఏపీ ఎంతో ముందుండేదని, ఇప్పుడు వెనకబడడానికి ఇక్కడి పాలకులే కారణమని చెప్పొచ్చు. తెలంగాణ తరహాలో ఏపీలో కూడా అభివృద్ధి చేసి చూపెడతానని చెప్పుకోవచ్చు. దీని ద్వారా ఏపీలో పాగా వేయడంతో పాటు అక్కడి వైసీపీ, టీడీపీ, బీజేపీలను ఎండగట్టొచ్చు. ఇలా విశాఖ ఉక్కు ఫ్యాక్టరీతో కేసీఆర్ కు అనేక ప్రయోజనాలు చేకూరనున్నాయి.













