జగన్పై కడప జిల్లా వైసీపీ నేత సంచలన వ్యాఖ్యలు..!
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎప్పుడూ ఆసక్తికరమే. ఎప్పుడూ ఏదో ఒక సంచలనం ఇక్కడ నమోదవుతూనే ఉంటుంది. తాజాగా ఇలాంటి సంఘటనే ఒకటి చోటుచేసుకుంది. అధికార పార్టీ వైసీపీపై ఆ పార్టీ నేతే సంచలన వ్యాఖ్యలు చేశారు. అది కూడా సీఎం సొంత జిల్లాకు చెందిన మాజీ మంత్రి ఇలాంటి కామెంట్స్ చేయడం ఆసక్తి రేపుతోంది. మాజీ మంత్రి, వైఎస్ కు సన్నిహితుడిగా పేరొందిన డి.ఎల్.రవీంద్రా రెడ్డి … అధికార వైసీపీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇదిప్పుడు వైసీపీలోనే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టిస్తోంది.
ఏపీలో జగన్ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందన్నారు డి.ఎల్.రవీంద్రా రెడ్డి. ఇవాళ జగన్ పుట్టినరోజు సందర్భంగా బైజూస్ ట్యాబ్స్ ను 8వ తరగతి విద్యార్థులందరికీ పంపిణీ చేసింది ప్రభుత్వం. ఈ నేపథ్యంలో బైజూస్ తో ఒప్పందాన్ని తప్పుబట్టారు డి.ఎల్.రవీంద్రా రెడ్డి. బైజూస్ కంటెంట్ ను మిగతా రాష్ట్రాలు వ్యతిరేకించాయని.. కానీ జగన్ ప్రభుత్వం మాత్రం దీనికోసం రూ.1400 కోట్లు వృధా చేసిందని తప్పుబట్టారు. బైజూస్ ఒప్పందం వెనుక కడప జిల్లాకు చెందిన ఇద్దరు వ్యక్తులు చక్రం తిప్పారన్నారు. ప్రభుత్వ ఉపాధ్యాయులు ఎంతో టాలెంట్ కలిగినవారని.. అలాంటి వారిని కాదని బైజూస్ పాఠాలు చెప్పడం వాళ్లను అవమానించడమేనన్నారు. బైజూస్ ఒప్పందం ఒక మోసం అన్న డి.ఎల్.. దానికోసం ఖర్చు చేసిన 1400 కోట్లలో కనీసం కొంతయినా ఉపాధ్యాయులకోసం ఖర్చు చేయాల్సిందని సూచించారు.
తాను ఇంకా వైసీపీలోనే కొనసాగుతున్నానన్నారు డి.ఎల్.రవీంద్రా రెడ్డి. తనను పార్టీ కూడా ఇంకా తొలగించలేదన్నారు. అవినీతికి తావులేకుండా పాలిస్తానని జగన్ చెప్పారని.. కానీ ఇప్పుడు ఇలాంటి అవినీతి ప్రభుత్వంతో కలిసి ఉన్నందుకు బాధగా ఉందని చెప్పారు డి.ఎల్. తన స్నేహితుడు వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి కుమారుడు ఇంత అవినీతిపరుడుగా మారుతాడని తాను అసలు ఊహించలేదన్నారు. చీప్ లిక్కరు తాగి తన మండలంలోనే ఆరుగురు చనిపోయారన్నారు. తప్పు చేసినవాడు తప్పించుకోలేడన్నారు డీఎల్ రవీంద్రా రెడ్డి. చట్టం నుంచి తప్పించుకున్నా.. దేవుడు శిక్షిస్తాడని స్పష్టం చేశారు. ఈ పార్టీలో తానున్నానంటే అసహ్యంగా ఉందన్నారు.
వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు అధికారంలోకి వస్తేనే రాష్ట్రం బాగుపడుతుందని సంచలన వ్యాఖ్యలు చేశారు డి.ఎల్.రవీంద్రా రెడ్డి. చంద్రబాబు అయితేనే రాష్ట్రాన్ని బాగు చేయగలరన్నారు. ఈసారి టీడీపీతో జనసేన పొత్తుపెట్టుకునే అవకాశం ఉందన్నారు. పవన్ కల్యాణ్ నిజాయితీపరుడన్నారు డి.ఎల్. అయితే తనకు పరిపాలనా సామర్థ్యం లేదన్నారు. అందుకే చంద్రబాబు అయితేనే రాష్ట్రాన్ని బాగుచేయగలడన్నారు. అంతేకాదు.. వై.ఎస్.వివేకా హత్యకేసు పైన కూడా డీఎల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జనవరి 3 తర్వాత ఈ కేసు ఊహించని మలుపు తిరుగుతుందన్నారు.













