Mohan Babu: మోహన్ బాబుకు షాక్..! కలెక్షన్ కింగ్ అనేది ఇందుకేనేమో..!?

టాలీవుడ్ నటుడు, సినీ నిర్మాత, కలెక్షన్ కింగ్ మోహన్ బాబు (Mohan Babu) స్థాపించిన మోహన్ బాబు ప్రైవేట్ యూనివర్సిటీ (MBU) భారీ షాక్‌కు గురైంది. నిబంధనలకు విరుద్ధంగా విద్యార్థుల నుంచి అధిక ఫీజులు వసూలు చేయడంతో పాటు, ఇతర అవకతవకలకు పాల్పడినందుకు గాను, ఈ యూనివర్సిటీ గుర్తింపును రద్దు చేయాలని ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ (APHERMC) రాష్ట్ర ప్రభుత్వానికి, UGC, AICTE వంటి ఇతర జాతీయ విద్యా సంస్థలకు సిఫారసు చేసింది. దీంతో ఆయన తరచూ చెప్పే ఉచిత విద్య ప్రచారం అంతా వాస్తవం కాదని తేలిపోయింది. బాధితులైన విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఉన్నత విద్యా కమిషన్ నిర్ణయంపై సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
తిరుపతి జిల్లా రంగంపేటలో ఉన్న శ్రీ విద్యానికేతన్ విద్యాసంస్థల నుంచి 2022లో ప్రైవేట్ విశ్వవిద్యాలయంగా మారిన మోహన్ బాబు యూనివర్సిటీపై (Mohan Babu University) అనేక ఫిర్యాదులు వచ్చాయి. ముఖ్యంగా, ప్రభుత్వం నిర్దేశించిన ఫీజుల కంటే అధికంగా, అదనపు ఫీజులు వసూలు చేస్తున్నారన్నదే ప్రధాన ఆరోపణ. గడచిన మూడు సంవత్సరాల్లో (2022-23 నుంచి) విద్యార్థుల నుంచి రూ. 26 కోట్లకు పైగా అదనంగా వసూలు చేసినట్లు విచారణలో తేలింది. ట్యూషన్ ఫీజు, బిల్డింగ్ ఫీజు, ఇతర ఫీజుల పేరుతో అదనపు మొత్తాలను వసూలు చేసినట్టు ఆరోపణలు ఉన్నాయి. అధిక ఫీజుల వసూలుతో పాటు, ఆదాయాన్ని వెల్లడించకపోవడం, విద్యార్థుల హాజరు నిర్వహణలో లోపాలు, ఒరిజినల్ సర్టిఫికెట్లను నిలిపివేయడం వంటి ఇతర నిబంధనల ఉల్లంఘనలు కూడా కమిషన్ దృష్టికి వచ్చాయి.
ఫిర్యాదులపై స్పందించిన ఉన్నత విద్యా కమిషన్ విచారణ జరిపి, యూనివర్సిటీపై కొరడా ఝుళిపించింది. మోహన్ బాబు యూనివర్సిటీకి రూ.15 లక్షల జరిమానా విధించింది. ఈ మొత్తాన్ని యూనివర్సిటీ చెల్లించినట్లు సమాచారం. విద్యార్థుల నుంచి అదనంగా వసూలు చేసిన రూ. 26.17 కోట్లను 15 రోజుల్లోగా తిరిగి చెల్లించాలని కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. వరుస నిబంధనల ఉల్లంఘనలు, అవకతవకల నేపథ్యంలో యూనివర్సిటీ అనుమతి, గుర్తింపును పూర్తిగా రద్దు చేయాలని ఏపీ ప్రభుత్వానికి, అలాగే యూజీసీ (UGC), ఏఐసీటీఈ (AICTE) వంటి జాతీయ నియంత్రణ సంస్థలకు కమిషన్ గట్టిగా సిఫారసు చేసింది.
సినీ నటుడిగా, విద్యావేత్తగా తనను తాను అభివర్ణించుకునే మోహన్ బాబు, తన విద్యా సంస్థల గురించి ఎన్నో వేదికలపై ఘనంగా మాట్లాడారు. విద్యారంగంలో తన సేవలను ప్రస్తావిస్తూ, పేద విద్యార్థులకు ఉచిత విద్య అందిస్తున్నానని, తానొక గొప్ప మానవతావాదినని తరచూ చెప్పుకునేవారు. అయితే, ఉన్నత విద్యా కమిషన్ విచారణలో వెలుగులోకి వచ్చిన అధిక ఫీజుల వసూలు, రూ. 26 కోట్ల అదనపు మొత్తాల వ్యవహారం ఆయన ప్రకటనల డొల్లతనాన్ని బయటపెట్టిందని విద్యా వర్గాలు విమర్శిస్తున్నాయి. ఒకవైపు ఉచిత విద్య అంటూ ప్రకటనలు చేస్తూ, మరోవైపు నియమాలను ఉల్లంఘిస్తూ విద్యార్థుల నుంచి అధిక ఫీజులు వసూలు చేయడం ఆయన మాటలకు, చేతలకు పొంతన లేదని స్పష్టం చేస్తోంది.
కమిషన్ నిర్ణయం తమకు న్యాయం చేకూరుస్తుందని భావించిన బాధిత విద్యార్థులు, తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తమ ఆవేదన, ఫిర్యాదులను పరిగణలోకి తీసుకుని ఉన్నత విద్యామండలి సరైన నిర్ణయం తీసుకుందని వారు అంటున్నారు. ఆయన్ను అందరూ కలెక్షన్ కింగ్ అని ఎందుకు పిలుస్తారో ఇప్పుడు అర్థమైందని ఎద్దేవా చేస్తున్నారు.
అయితే, ఉన్నత విద్యా కమిషన్ సిఫారసుపై మోహన్ బాబు యూనివర్సిటీ హైకోర్టును ఆశ్రయించినట్లు తెలుస్తోంది. జరిమానా చెల్లింపు, అదనపు ఫీజుల తిరిగి చెల్లింపుపై కమిషన్ ఇచ్చిన ఆదేశాలపై హైకోర్టు తాత్కాలిక స్టే విధించినట్లు సమాచారం. ఈ పరిణామం యూనివర్సిటీ భవిష్యత్తుపై తీవ్ర అనిశ్చితిని నెలకొల్పింది. ప్రభుత్వం, జాతీయ విద్యా సంస్థలు కమిషన్ సిఫారసుపై ఎలాంటి తుది నిర్ణయం తీసుకుంటాయనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.