అర్చకులకు ఏపీ సర్కార్ శుభవార్త!
కరోనా మహమ్మారి నేపథ్యంలో లాక్డౌన్ విధించిన దృష్ట్యా ఇబ్బందులు ఎదుర్కొంటున్న అర్చకులకు ఆంధప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. చిన్న దేవాలయాల్లో పనిచేసే అర్చకుల సంక్షేమం కోసం కీలక నిర్ణయం తీసుకుంది. అర్చక వెల్ఫేర్ ఫండ్ ద్వారా ఒక్కొక్కరికి రూ.5 వేల చొప్పున ఆర్థిక సాయం చేయాలని నిర్ణయించినట్టు దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ వెల్లడించారు. కరోనా నేపథ్యంలో వనరుల లేమితో అర్చకులు ఇబ్బందులు పడుతున్నందున వారిని ఆదుకోవాలని ముఖ్యమత్రి వైఎస్ జగన్ ఆదేశాల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నామని ఆయన తెలిపారు.
కరోనా తీవ్రత దృష్ట్యా కేంద్రం సూచనలకు అనుగుణంగా ఏప్రిల్ 14 వరకు దేవాలయాల్లో భక్తులకు అనుమతి నిరాకరించినట్టు మంత్రి ఈ సందర్భంగా గుర్తు చేశారు. దీంతో ఆలయాల్లో కేవలం అర్చకులు మాత్రమే నిత్య పూజలు చేస్తున్నారని తెలిపారు. చిన్న దేవాలయాల్లో అర్చకులకు ఎలాంటి ఆదాయం లేకపోవడంతో వారు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.













