ఏపీలోనూ పదో తరగతి పరీక్షల్లేవ్…
ఎన్ని అభ్యంతరాలు వచ్చినా పరీక్షల నిర్వహణపై ముందుకే వెళ్లనున్నట్టు కనిపించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం… తాజా పరిణామాల నేపధ్యంలో ఎట్టకేలకు దిగి వచ్చింది. ఓ వైపు కరోనా కేసులు ఇంతింతై అన్నట్టు పెరిగిపోతున్న పరిస్థితుల్లో… పదో తరగతి పరీక్షలను నిర్వహించాలన్న తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. పొరుగు రాష్ట్రాలైన తమిళనాడు, తెలంగాణలను అనుసరిస్తూ పరీక్షలను రద్దు చేసింది. ఈ విషయాన్ని శనివారం విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రకటించారు. పరిస్థితులు ఎలా ఉన్నా విద్యార్ధుల భవిష్యత్తు గురించి ఆలోచించి తప్పనిసరిగా పరీక్షలు నిర్వహించాలనే తాము అనుకున్నామని అందుకోసం పలు మార్పు చేర్పులు కూడా చేశామని తెలిపారు.
పరీక్ష విధానంలో మార్పులు చేస్తూ 11 పేపర్లకు బదులు ఆరు పేపర్లు మాత్రమే పెట్టాలని అనుకున్నామన్నారు. అలాగే విద్యార్ధులు తగినంత భౌతిక దూరం పాటించేందుకు వీలుగా పరీక్ష కేంద్రాలు కూడా పెంచామని దీంతో పాటు అన్ని రకాలుగా ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నామన్నారు. అయితే విద్యార్ధుల ఆరోగ్య భద్రత తమకు ప్రధానం కాబట్టి దీని దృష్ట్యా పదో తరగతి పరీక్షలు రద్దు చేయాలనే నిర్ణయం తీసుకున్నామని వివరించారు. ప్రస్తుతం నెలకొన్న ప్రత్యేక పరిస్థితులను రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దృష్టికి తీసుకెళ్లి అనంరతరమే ఈ రద్దు నిర్ణయం తీసుకున్నామని స్పష్టం చేశారు. కరోనా ప్రబలుతున్న సమయంలో రాష్ట్రంలో ఏ తల్లి కూడా తన బిడ్డ ఆరోగ్యం గురించి బెంగపెట్టుకోకూడదని సీఎం జగన్ తమకు తేల్చి చెప్పారన్నారు. పదో తరగతితో పాటు ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు కూడా రద్దు చేస్తున్నట్టు ఈ సందర్భంగా ఆయన వెల్లడించారు.













