లాజిస్టిక్ హబ్‌గా నవ్యాంధ్ర
దేశ వ్యాప్తంగా రైల్వేల అభివృద్ధి సగటులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ముందంజలో ఉందని రైల్వేమంత్రి సురేష్ ప్రభు అన్నారు. దేశానికి లాజిస్టిక్ హబ్‌గా ఆంధ్రప్రదేశ్ అవతరించనుందన్నారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, రైల్వే మంత్రి సురేష్ ప్రభు, కేంద్ర సమాచార పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు, పౌర విమానయాన శాఖ మంత్రి పి.అశోక్‌గజపతిరాజు లతో కలిసి రిమోట్ కంట్రోల్ ద్వారా 10 రైల్వే ప్రాజెక్టుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలను వీడియో లింక్ ద్వారా ప్రారంభించారు. ఈ సందర్భంగా రైల్వే మంత్రి మాట్లాడుతూ ఎన్నో కొత్త ప్రాజెక్టులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రారంభించామని, ఇది ఆంధ్ర ప్రజల అదృష్టమని తెలిపారు. ఒకే రోజు 10 ప్రాజెక్టులు ప్రారంభించుకున్నామని, ఇవి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి గీటుగాయిగా నిలుస్తాయన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ చెప్పినట్లు దేశానికి గమనం, పురోగమనం కూడా రైల్వేల వల్లనే లభిస్తుందన్నారు.. రాష్ట్రానికి మంజూరు చేయవలసిన రైల్వే ప్రాజెక్టులు దశాబ్దాలుగా నిర్లక్ష్యానికి గురుయ్యాని, తమ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే రాష్ట్ర అవసరాలను గుర్తించి ప్రాజెక్టులను మంజూరు చేస్తున్నట్లు తెలిపారు.













