ఏపీలో ఇళ్లపట్టాల పంపిణీ మళ్లీ వాయిదా…
ఆంధప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఆగస్టు 15న నిర్వహించాలనుకున్న ఉచిత ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం మరోసారి వాయిదా పడింది. కోర్టులో విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని వాయిదా వేసింది. అక్టోబర్ 2న ఇళ్ల పట్టాల పంపిణీ చేపట్టాలని భావిస్తోంది. తొలుత ఉగాది రోజున రాష్ట్రంలో 30 లక్షల మందికి ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం చేపట్టాలని ప్రభుత్వం ప్రణాళికలు వేసింది. అనంతరం బీఆర్ అంబేడ్కర్ జయంతికి ఇద్దామనుకున్నా వీలు కాలేదు. దీంతో జులై 8న వైఎస్ జయంతి సందర్భంగా ఇళ్ల పట్టాలు పంపిణీ చేయాలని యోచించింది. కానీ ఇళ్ల స్థలాల సేకరణ ఆలస్యంతో ఆగస్టు 15కు వాయిదా వేసింది. ప్రస్తుతం కోర్టులో దీనిపై విచారణ జరుగుతుండటంతో మరోసారి ఈ కార్యక్రమం వాయిదా పడింది.













