ట్యాపింగ్ ఆరోపణలు..స్పందించిన ఏపీ హోం మంత్రి
గత రెండు మూడు రోజులుగా ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయం కోర్టుల్ని కూడా రచ్చలోకి లాగే యత్నం చేస్తోంది. ఎన్నడూ లేని విధంగా న్యాయవ్యవస్థతో ప్రభుత్వం దోబూచులాడుతోందంటూ వస్తున్న వార్తలు సంచలనంగా మారాయి. ఏకంగా న్యాయవ్యవస్థపైనే నిఘా పెట్టారంటూ ఓ దినపత్రిక ఆరోపణలు గుప్పించడం పొలిటికల్ హీట్ రాజేసింది. ఈ ఆరోపణల కధనంపై ఏపీ ప్రభుత్వం కూడా తీవ్రంగా స్పందించింది. దీనిపై సదరు దినపత్రికకు నోటీసులు కూడా జారీ చేసింది. న్యాయవ్యవస్థకు ప్రభుత్వానికి మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారంటూ ప్రభుత్వ పెద్దలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపధ్యంలోనే న్యాయమూర్తుల ఫోన్ల ట్యాపింగ్ వ్యవహారంపై ఓ న్యాయవాది హైకోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేశారు. అదే క్రమంలో ప్రతిపక్ష నేత చంద్రబాబు కూడా ఫోన్ ట్యాపింగ్‌ను బలపరుస్తూ ప్రభుత్వాన్ని తప్పుబట్టారు. ఈ నేపధ్యంలో రాష్ట్ర హోం మంత్రి సుచరిత సోమవారం స్పందించారు. రాష్ట్రంలో ఫోన్ల ట్యాపింగ్ జరుగుతోందని ప్రతిపక్ష నేత చంద్రబాబు చేసిన ఆరోపణలు నిరాధారమని ఖండించారు. సుదీర్ఘకాలం సీఎంగా పనిచేసిన వ్యక్తి ఇలాంటి ఆరోపణలు చేయడం సమంజసం కాదన్నారు. వైకాపా ప్రభుత్వంపై బురద చల్లడానికి ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. సంక్షేమ పథకాలు అన్ని వర్గాల వారికి అందిస్తున్న సమయంలో ప్రజల్లో ప్రభుత్వంపై ఆదరణ పెరగకుండా ఇలాంటి కుట్రలు చేస్తున్నారని ప్రత్యారోపణలు చేశారు.
‘‘ఈ ప్రభుత్వానికి ఫోన్లు ట్యాపింగ్ చేసే అవసరం లేదు. సంఘ విద్రోహ శక్తులు, తీవ్రవాదుల ఫోన్లు మాత్రమే ట్యాపింగ్ చేస్తారు. మీరు ఏమైనా సంఘ విద్రోహ కార్యకలాపాలు చేస్తున్నారా? ఫోన్ ట్యాపింగ్ చేస్తే మీ మనీ లాండరింగ్ వ్యవహారం బయటకు వస్తుందని భయపడుతున్నారా?’’ అంటూ ఆమె ప్రశ్నలు గుప్పించారు. దేశంలోనే జగన్ మూడో అత్యుత్తమ సీఎం గా పేరు తెచ్చుకోవడం చూసి ఓర్వలేకే ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని అన్నారు.













