‘ఆయుర్వేద మందు’ పై అధ్యయనం చేయండి : సీఎం జగన్ ఆదేశం

నెల్లూరులోని ఆనందయ్య ఆయుర్వేద మందుపై అధ్యయనం చేయాలని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నిర్ణయించారు. ఈ మేరకు ఆయుర్వేద మందుపై శాస్త్రీయ నిర్ధారణ చేయించాలని అధికారులను సీఎం పురమాయించారు. ఇందులో భాగంగా నెల్లూరుకు వైద్యులు, శాస్త్రవేత్తల బృందాలని పంపించనున్నారు. ఈ ఆయుర్వేద మందు కోసం ప్రజలు పెద్ద ఎత్తున ఆసక్తి చూపుతున్నారు. కరోనా విరుగుడుకు ఈ మందు అద్భుతంగా పనిచేస్తోందని అందరికీ పాకడంతో ప్రజలు పెద్ద ఎత్తున అక్కడ గుమిగూడుతున్నారు. నెల్లూరు పరిసర ప్రాంతాల్లోని చాలా మంది తరలివస్తున్నారు. దాదాపు 3 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలో సీఎం జగన్ అప్రమత్తమయ్యారు. ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆ మందు పంపిణీ చేయాలా? వద్దా? అన్న అంశంపై ఉన్నతాధికారులతో చర్చించారు. నెల్లూరు జిల్లా కృష్ణపట్నానికి ఐసీఎంఆర్ బృందాన్ని పంపాలని, ఆయుర్వేద వైద్యంపై శాస్త్రీయ నిర్ధారణ చేయించాలని సీఎం జగన్ ఆదేశించారు.
మొదట వద్దని… ఆ తర్వాత ఓకే అని…
నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలంలో ఉన్న కృష్ణపట్నంలో కరోనా నివారణకు ఆయుర్వేద మందు ఇస్తున్నారు. బొనిగి ఆనందయ్య ఉచితంగానే మందును పంపిణీ చేస్తున్నారు. అయితే దీనికి ప్రభుత్వం మొదట ఓకే చెప్పలేదు. ఆ తర్వాత గ్రీన్ సిగ్నల్ ఇఆచ్చింది. ఆయుర్వేద కరోనా మందులో ఎలాంటి హానికర పదార్థాలు లేవని ల్యాబులో తేలడంతో మళ్లీ మందు పంపిణీ ప్రారంభమైంది. అందులో నల్ల జీలకర్ర, తోక మిరియాలు, పచ్చ కర్పూరం, పెద్ద పల్లేరు కాయ, నేల ఉసిరి, పిప్పిళ్ల చెక్క, పుప్పింట ఆకు, గుంట గరగర తేనె, పసుపు, జాజికా, మారేడు, వేప ఇగురు తదితర పదార్థాలున్నాయని అధికారులు తేల్చారు.