ఏపీని అభివృద్ధి చేసే బాధ్యత అందరిదీ
ఆంధ్రప్రదేశ్‌ను అభివృద్ధి చేసే బాధ్యత అందరూ తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. చిత్తూరు జిల్లా పర్యటనలో భాగంగా రొంపిచర్ల మండలంలో పర్యటించారు. పలు అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగసభలో ఆయన మాట్లాడుతూ నా పిలుపునకు స్పందించి రైతులు రాజధాని నిర్మాణానికి రూ.40వేల కోట్ల విలువైన భూములను ఇవ్వడం అభినందనీయమని అన్నారు. చిత్తూరులో జిల్లాలో శ్రీసిటి వస్తుందని, తిరుపతి ఎయిర్‌పోర్టు పక్కన సెల్ కంపెనీలు వస్తున్నాయన్నారు. మన పిల్లలు ఇక్కడే ఉద్యోగాలు సాధించాలనే లక్ష్యంతో ముందుకు పోతున్నామని తెలిపారు. చెత్తరహిత ప్రాంతంగా పంచాయతీలను తయారు చేస్తున్నట్లు చెప్పారు. స్థానిక చెరువులను కలిపేందుకు రూ.4కోట్లను కేటాయిస్తున్నట్లు తెలిపారు. రొంపిచర్ల క్రాస్ నుంచి రొంపిచర్లకు వెళ్లే మార్గాన్ని విస్తరించాలని ఆదేశాలు జారీ చేశారు. రైతులు సహకరిస్తే సంక్షోభాలను అధిగమిస్తామని అన్నారు. వచ్చే ఏడాదిలో 2 లక్షల 50 వేల ఎకరాల్లో బిందు సేద్యానికి శ్రీకారం చుడుతున్నట్లు తెలిపారు.
నీరు, ప్రగతి కోసం ఉద్యమం చేశానని, ఈ ఉద్యమంలో 3,500 పనులు చేయబోతున్నామని చెప్పారు. జిల్లాలో 37శాతం తక్కువ వర్షం పడినా, వ్వవసాయంలో 14 శాతం వృద్ధి సాధించామని తెలిపారు. జిల్లాలో శాంతిభద్రతల సమస్య ఉండకూడదని, రౌడీయిజాన్ని సహించేది లేదని అన్నారు. తిరుపతిని అన్నివిధాలుగా అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. విశాఖకు 15 రోజులకో ఐటీ కంపెనీ వస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు లోకేష్, అమర్నాథ్రెడ్డి, స్థానిక నేతలు, ముఖ్య అధికారులు పాల్గొన్నారు.













