మన శక్తి ఏంటో కేంద్రానికి తెలిసేలా నిర్మిస్తాం
కడపలో ఉక్కు పరిశ్రమతో రాయలసీమ చరిత్ర పూర్తిగా మారుతుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. కడప జిల్లా మైలవరం మండలం కంబాలదిన్నె వద్ద ఉక్కు పరిశ్రమకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన బహిరంగసభలో చంద్రబాబు మాట్లాడుతూ మన శక్తి ఏంటో కేంద్రాన్ని తెలియజెప్పేలా ఉక్కు పరిశ్రమ నిర్మాణాన్ని పూర్తి చేస్తామన్నారు. నీరు, విద్యుత్ సౌకర్యాలు కల్పిస్తామని చెప్పినా కేంద్ర ప్రభుత్వం ముందుకు రాలేదని విమర్శించారు. ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా కేంద్రం పట్టించుకోలేదన్నారు. ఢిల్లీ వెళ్లి పోరాటం చేసినా కేంద్రం కనికరించలేదన్నారు. ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు ఎంపీ సీఎం రమేశ్, ఎమ్మెల్సీ బీటెక్ రవి ఆమరణ దీక్ష చేశారని గుర్తు చేశారు. ఎన్నిసార్లు చెప్పినా కేంద్రం పట్టించుకోకపోవడంతో 60 రోజుల అల్టిమేటం ఇచ్చామని, ఆలోపు ముందుకు రావాలని కేంద్రాన్ని కోరమన్నారు. అప్పటికీ స్పందించకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వమే పరిశ్రమ ఏర్పాటు బాధ్యతను తీసుకుందన్నారు.
రాష్ట్రానికి న్యాయం చేయాలని కేంద్రంపై పోరాడుతుంటే టీడీపీ నేతలపై ఐటీ దాడులు చేయిస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రానికి చెందిన ప్రతిపక్ష నాయకులు ఉక్కు పరిశ్రమపై పోరాడకుండా పారిపోయే పరిస్థితికి వచ్చారని పరోక్షంగా వైకాపాను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. జగన్ వంటి నేతలకు ఉక్కు పరిశ్రమ ఏర్పాటు ఇష్టం లేదన్నారు. ఉక్కు పరిశ్రమతో ఇక్కడి భూములకు విలువ పెరిగి రైతులు ఆనందంగా ఉండటం జగన్కు ఇష్టం లేదా అని ప్రశ్నించారు. రాయలసీమ అభివృద్ధికి ఉక్కు సంకల్పంతో ముందుకెళ్తున్నామని అన్నారు. నెలలోపు ఉక్కు పరిశ్రమ భూసేకరణ పూర్తి చేసి, 3 నెలల్లో పనులు ప్రారంభించాలని అధికారులకు సూచించానని తెలిపారు.













