Nagababu: జూన్‌లో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ.. నాగబాబుకు మంత్రి పదవి ఖాయమా?

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాజకీయ వర్గాల్లో మళ్లీ మంత్రివర్గ మార్పులపై చర్చలు జోరుగా సాగుతున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu Naidu) ప్రస్తుతం తన మంత్రివర్గంలోని సభ్యుల పనితీరుపై సమీక్ష చేస్తున్నారని, కొందరి పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారన్న మాటలు వినిపిస్తున్నాయి. ప్రతి మంత్రివర్గ సమావేశంలోనూ ఆయన పనితీరుపై దృష్టి పెట్టి సూచనలు ఇస్తున్నట్లు సమాచారం. అధికారంలోకి వచ్చిన దాదాపు ఏడాది కాలం గడుస్తున్నా కొంతమంది మంత్రులు తమ విధానాన్ని మార్చుకోలేదని, అదే కారణంగా వారిపై చర్యలు తీసుకునే అవకాశముందని చర్చ జరుగుతోంది.
ఈ నేపథ్యంలో మూడు శాఖలపై అసంతృప్తి ఎక్కువగా ఉండటంతో ఆ మంత్రులను తప్పించవచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ మంత్రులు తమ శాఖల పరిపాలనలో తగిన పురోగతిని చూపించకపోవడంతో పాటు ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో కూడా విఫలమయ్యారని అంటున్నారు. ప్రస్తుతం 25 మంది మంత్రులను నియమించే అవకాశం ఉన్నా, గత సంవత్సరం జూన్ 12న జరిగిన ప్రమాణ స్వీకార కార్యక్రమంలో 24 మందికే మంత్రి పదవులు ఇచ్చారు. మిగిలిన ఒక్క స్థానాన్ని జనసేన (Jana Sena) నేత నాగబాబు (Nagababu)కు కేటాయించనున్నట్టు ప్రచారం జరుగుతోంది.
ఇప్పుడు పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఉపముఖ్యమంత్రిగా, నాదెండ్ల మనోహర్ (Nadendla Manohar), కందుల దుర్గేష్ (Kandula Durgesh)లు మంత్రులుగా ఉన్న నేపథ్యంలో నాగబాబు చేరితే జనసేనకు నాలుగు మంత్రి పదవులు దక్కనున్నాయి. ఇదే సమయంలో తమకు ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఉన్నారని, కనీసం రెండు పదవులు ఇవ్వాలని భారతీయ జనతా పార్టీ (BJP) వర్గాలు కోరుతున్నాయి. ఇప్పటికే సత్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav) మంత్రిగా ఉన్న నేపథ్యంలో, మరో నేతకు అవకాశం ఇవ్వాలన్న ఆలోచన కూడా ఉందట. అయితే మంత్రుల సంఖ్య పరిమితిగా ఉండటంతో, బీజేపీకి మరో పదవి ఇవ్వాలంటే ప్రస్తుతం ఉన్న ఎవరో ఒకరిని తప్పించాల్సి వస్తుంది. తెలుగుదేశం పార్టీ (TDP)లో కూడా మంత్రిగా అవకాశం కోసం ఎదురు చూస్తున్న నేతలు ఉన్నారు. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుంటే ముగ్గురు మంత్రులను తప్పించి మరో ముగ్గురిని తీసుకునే అవకాశం ఉందన్న ప్రచారం ఊపందుకుంది.
ఈ మార్పులు జూన్ (June) నెలాఖరులోపు జరిగే అవకాశం ఉందని అంటున్నారు. జూలై (July)లో ఆషాడ మాసం ఉండటంతో, అంతకుముందే మార్పులు జరిపే యోచనలో ఉన్నారని సమాచారం. అయితే ఇందులో ఎంతవరకు నిజముందో తెలియదు కానీ మొత్తానికి టీడీపీ లో ఇద్దరు మంత్రుల పదవులు డేంజర్లో ఉన్నాయని రాజకీయంగా చర్చ జోరుగా సాగుతోంది. ఇంతకీ ఆ ఇద్దరు ఎవరు అన్నది ఆసక్తికర అంశంగా మారింది. మరోపక్క నాగబాబుకు మాత్రం మంత్రి పదవి ఖాయమనే అభిప్రాయం బలంగా వినిపిస్తోంది.