Health Scheme: ఏపీలో ఆరోగ్య బీమా.. అందరికీ ధీమా..!!

ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ (TDP) నేతృత్వంలోని కూటమి (NDA) రాష్ట్ర ప్రజల ఆరోగ్య భద్రత కోసం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని సుమారు 5 కోట్ల మంది ప్రజలకు ఉచిత వైద్య సేవలను అందించేందుకు సమగ్ర ఆరోగ్య బీమా పథకాన్ని (comprehensive health scheme) అమలు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ పథకం కింద ప్రతి కుటుంబానికి సంవత్సరానికి రూ.25 లక్షల వరకు ఉచిత వైద్య సేవలు అందుబాటులో ఉంటాయి. 2024 ఎన్నికల్లో టీడీపీ ఇచ్చిన సూపర్ సిక్స్ హామీల్లో ఇదీ ఒకటి. ఇది రాష్ట్ర ఆరోగ్య రంగంలో గేమ్ ఛేంజర్‌గా మారనుందని టీడీపీ భావిస్తోంది.
సమగ్ర ఆరోగ్య బీమా పథకాన్ని ఆయుష్మాన్ భారత్ (Ayushman Bharath), డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా (NTR Vaidya Seva) పథకాలను సమ్మిళితం చేయడం ద్వారా అమలు చేస్తారు. ఈ పథకం కింద 1.63 కోట్ల కుటుంబాలు లబ్ధి పొందనున్నాయి. ఇందులో 1.43 కోట్ల కుటుంబాలు ఆర్థికంగా వెనుకబడినవి కాగా మిగిలినవి 20 లక్షలు ఉన్నాయి. ఈ పథకం ద్వారా 3,257 రకాల వైద్య సేవలు అందిస్తారు. ఇందులో ఆసుపత్రిలో చేరిక, శస్త్రచికిత్సలు, రోగ నిర్ధారణ, మందులు, ఇతర అనుబంధ సేవలు ఉన్నాయి. ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులలో క్యాష్‌లెస్ సదుపాయంతో వీటిని వినియోగించుకోవచ్చు.
ఈ పథకంలో రూ.2.5 లక్షల వరకు ఖర్చులను బీమా కంపెనీలు భరిస్తాయి. రూ.2.5 లక్షల నుండి రూ.25 లక్షల వరకు ఖర్చులను డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్ట్ భరిస్తుంది. ఈ హైబ్రిడ్ మోడల్ ద్వారా ప్రభుత్వం ఆర్థిక భారాన్ని తగ్గించడమే కాకుండా, సేవల అమలులో పారదర్శకత, సమర్థతను పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది. రోగులు ఆసుపత్రిలో చేరిన ఆరు గంటల్లోనే అనుమతులు మంజూరు చేస్తారు. ఇది వైద్య సేవలలో ఆలస్యాన్ని గణనీయంగా తగ్గిస్తుందని భావిస్తున్నారు. అదనంగా ఈ పథకం అమలును పర్యవేక్షించడానికి ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్ట్ లో ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేస్తారు.
2024 మే 1న చీరాలలో జరిగిన ప్రజాగళం సభలో చంద్రబాబు (Chandrababu), కూటమి అధికారంలోకి వస్తే ప్రతి కుటుంబానికి రూ.25 లక్షల ఆరోగ్య బీమాను అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ హామీని నెరవేర్చే దిశగా కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఈ స్కీం రాష్ట్ర ప్రభుత్వంపై భారీగా ఆర్థిక భారం మోపుతుందని అంచనా వేస్తున్నారు. అయినా ఇచ్చిన హామీని నెరవేర్చాలని చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయించింది. 2.5లక్షల బీమా ప్రీమియంను ప్రభుత్వమే భరిస్తుంది. ఆ తర్వాత 25 లక్షల వరకూ ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా అందించనున్నారు.
ఈ పథకం పట్ల ప్రజల నుంచి సానుకూల స్పందన లభిస్తోంది. ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు ఈ పథకం ఒక వరంగా మారుతుందని అంచనా వేస్తున్నారు. నాణ్యమైన వైద్య సేవలను ఆర్థిక భారం లేకుండా ఇది అందిస్తుంది. అయితే, ఈ పథకం విజయవంతంగా అమలు కావడానికి సమర్థవంతమైన పర్యవేక్షణ వ్యవస్థ, మోసాల నివారణ, ఆసుపత్రులకు సకాలంలో చెల్లింపులు చేయడం చాలా కీలకం. గతంలో బిల్లులను ఆలస్యంగా చెల్లించడంతో ఆసుపత్రులు సేవలను నిలిపివేసిన సందర్భాలు ఉన్నాయి. ఇలాంటివి ఎదురుకాకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది.